శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:54 PM
హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరిట అనవసరపు ఆందోళనలు చేపట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఎస్‌పీ అమిత్‌బర్ధార్ హెచ్చరించారు.
ఎస్‌పీ అమిత్‌బర్ధార్ హెచ్చరిక
17న మహాధర్నాకు అనుమతి లేదని వెల్లడి
పాడేరు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరిట అనవసరపు ఆందోళనలు చేపట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఎస్‌పీ అమిత్‌బర్ధార్ హెచ్చరించారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశాలతో కలెక్టర్ దినేశ్‌కుమార్‌తో కలిసి అరకులోయ గిరిజన నేతలతో తాము సమావేశం నిర్వహించి హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించిన అనేక విషయాలను తెలిపామన్నారు. ప్రధానంగా స్థానిక గిరిజనుల ఆమోదం లేకుండా ఎటువంటి చర్యలు చేపట్టబోమన్నారు. అలాగే ప్రస్తుతం అక్కడ ఎటువంటి పనులు జరగడం లేదని, అయినప్పటికీ ఆందోళనలు, నిరసనలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఈ నెల 17న పాడేరులో తలపెట్టిన మహాధర్నాకు ఎటువంటి అనుమతి లేదని ఎస్‌పీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో మహాధర్నా పేరిట ప్రజలను రెచ్చగొట్టడం వంటి శాంతిభద్రల సమస్యలు సృష్టిస్తే చట్టరీత్యా చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దు
ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో తాజా పరిస్థితుల నేపథ్యంలో స్థానికులు అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని ఎస్‌పీ అమిత్‌బర్ధార్ సూచించారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు జిల్లాలో ప్రవేశించి, ఒడిశాలోని గంజాయిని కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ఆశ్రయం కల్పించడం, సహాయం చేయడం వంటివి వద్దన్నారు. జిల్లాను గంజాయి రహితం చేయాలనే లక్ష్యంతో యంత్రాంగం ఉందని, అందుకు అందరూ సహకరించాలని, గంజాయి సాగు, రవాణాకు పాల్పడవద్దన్నారు. అలాగే స్మగ్లర్ల ఆస్తులను కొనుగోలు చేయడం, వారి అక్రమ పనులకు సహకరించడం చేస్తే అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్‌పీ స్పష్టం చేశారు.