న్యాయం చేయాలంటూ ‘పల్లా’కు జిల్లా వీఆర్‌వోల వినతి
ABN , Publish Date - Aug 11 , 2025 | 08:37 PM
జిల్లాలో గత 15 ఏళ్లుగా వీఆర్‌ఏ టూ వీఆర్‌వోలుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు జిల్లా వీఆర్‌వో సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమవారం గాజువాకలోని టీడీపీ కార్యాలయంలో పల్లాను కలిసిన వీఆర్‌వోలు తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు.
గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆవేదన
గాజువాక, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత 15 ఏళ్లుగా వీఆర్‌ఏ టూ వీఆర్‌వోలుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు జిల్లా వీఆర్‌వో సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమవారం గాజువాకలోని టీడీపీ కార్యాలయంలో పల్లాను కలిసిన వీఆర్‌వోలు తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 3,786 మంది వీఆర్‌ఏలుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు 2019లో గత వైసీపీ ప్రభుత్వం గ్రేడ్-2 వీఆర్‌వోలుగా పదోన్నతి కల్పించి సచివాలయాల్లో రెండేళ్ల పాటు విధులు నిర్వహించాలంటూ పలు ఆంక్షలతో ఉత్తర్వులు ఇచ్చిందని పల్లాకు తెలియజేశారు. అయితే ఆర్డర్ కాపీలో ఉన్న ప్రకారం తాము అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులమై ఐదేళ్లయినా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో వీఆర్‌ఏలను గ్రేడ్-1 వీఆర్‌వోలుగా పదోన్నతి కల్పించడం జరిగిందని, కానీ గత వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని వాపోయారు. ఎన్నికలకు ముందు తాము టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కలిసి సమస్యను వివరిస్తే తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. తమకు గ్రేడ్-1 వీఆర్‌వోలుగా పదోన్నతి కల్పించి న్యాయం జరిగేలా చూడాలని వారు పల్లా శ్రీనివాసరావును కోరారు. ఈ అంశాన్ని పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పల్లా హామీ ఇచ్చినట్టు వీఆర్‌ఏల సంఘం నాయకులు పేర్కొన్నారు.