పింఛన్ల పంపిణీలో జిల్లా టాప్
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:49 PM
అక్టోబరు నెల సామాజిక పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది.
98.67 శాతం లబ్ధిదారులకు అందజేసిన పెన్షన్లు
అధికారులు, సిబ్బందిని అభినందించిన కలెక్టర్ దినేశ్‌కుమార్
పాడేరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): అక్టోబరు నెల సామాజిక పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. జిల్లాలోని 22 మండలాల పరిధిలో 1,22,507 మంది పింఛన్ల లబ్ధిదారులకు శుక్రవారం నాటికి 1,20,872 మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించడంతో 98.67 శాతంగా నమోదైంది. దీంతో పింఛన్ల పంపిణీలో రాష్ట్ర స్థాయిలో జిల్లాకే ప్రథమ స్థానం దక్కడంతో కలెక్టర్ దినేశ్‌కుమార్‌ను రాష్ట్ర స్థాయి అధికారులు అభినందించారు. అలాగే జిల్లాలో వర్షాలతోపాటు రోడ్లు, సమాచార వ్యవస్థతో అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లోనూ గ్రామ సచివాలయ సిబ్బంది సకాలంలో లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందించారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రథమ, చిత్తూరు (97.87 శాతం) ద్వితీయ, తిరుపతి (97.87) తృతీయ స్థానాల్లో నిలిచాయి. దీంతో జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ విజయవంతానికి ఎంతో కృషి చేసిన డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, ఎంపీడీవోలు, గ్రామ సచివాలయ సిబ్బంది, తదితరులను జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అభినందించారు.