Share News

ప్రగతి పథంలో జిల్లా

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:14 AM

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ఏడాది కాలంలోనే జిల్లాలో ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించామని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. ఏడాదిలో జిల్లాలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం గర్వకారణమన్నారు.

ప్రగతి పథంలో జిల్లా
కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి

- రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న పారిశ్రామిక వేత్తలు

- పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు

- పక్కాగా పి-4 అమలుకు చర్యలు

- విజిటబుల్‌ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

- అచ్యుతాపురంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి త్వరలో అందుబాటులోకి..

- ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో కలెక్టర్‌ విజయకృష్ణన్‌

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ఏడాది కాలంలోనే జిల్లాలో ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించామని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. ఏడాదిలో జిల్లాలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం గర్వకారణమన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో విజన్‌-2047, పి-4 లక్ష్య సాధనకు ముందుకు సాగుతామన్నారు. కలెక్టర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లాలో ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, భవిష్యత్‌ జిల్లా అభివృద్ధి ప్రణాళికను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

ప్రశ్న: జిల్లాలో పారిశ్రామిక ప్రగతి ఎలా ఉంది?

కలెక్టర్‌: ఏడాది కాలంలోనే ప్రముఖ దిగ్గజ కంపెనీలు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇంధన, ఉక్కు, ఔషధ రంగాల్లో ప్రముఖ కంపెనీలు రూ.లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. అనకాపల్లి మండలం కోడూరులో సుమారు 40 ఎకరాల్లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఫార్మా రీసెర్చ్‌ యూనివర్సిటీ ఏర్పాటు కానున్నది. అచ్యుతాపురం మండలం పూడిమడకలో 1,600 ఎకరాల్లో రూ.లక్షా 85 వేల కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ పవర్‌ ప్రాజెక్టుకు, నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీ సెజ్‌లో సుమారు 2,200 ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి. నక్కపల్లి ఏపీఐసీసీ సెజ్‌లో ఆర్సెల్లార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ ఇండియా కలిసి జాయింట్‌ వెంచర్‌గా సుమారు రూ.లక్షా 47 వేల కోట్ల భారీ పెట్టుబడులతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. అచ్యుతాపురం, రాంబిల్లి ఫార్మా సెజ్‌లో అనేక ఔషధ తయారీ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రశ్న: పారిశ్రామిక పార్కుల పురోగతి ఏమిటి?

కలెక్టర్‌: జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చిన్న, మధ్యతరగతి పారిశ్రామిక పార్కులను (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిపాలన పరమైన ఆమోదం తెలిపింది. ఇప్పటికే అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల, పెందుర్తి నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం భూ సమీకరణ పనిలో నిమగ్నమైంది.

ప్రశ్న: పేదరిక నిర్మూలనకు చేపడుతున్న చర్యలు?

కలెక్టర్‌: విజన్‌-2047, పి-4 కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా సమర్థంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో విజన్‌ డాక్యుమెంట్లు రూపొందిస్తున్నాం. పి-4లో భాగంగా పేదరికంలో ఉన్నవారిని గుర్తించి ప్రైవేటు భాగస్వామ్యంతో సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించి, జిల్లా తలసరి ఆదాయం పెంచేందుకు కృషి జరుగుతోంది. ఇప్పటి వరకు 2,104 బంగారు కుటుంబాలను గుర్తించి దత్తత తీసుకోవడం ద్వారా భరోసా కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రశ్న: వ్యవసాయ రంగ అభివృద్ధికి తీసుకున్న చర్యలు?

కలెక్టర్‌: జిల్లాలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు అందుబాటులో ఉంచాం. రైతుల ఆర్థిక ఎదుగుదలకు విశాఖ నగరానికి సమీపంలో ఉన్న కె.కోటపాడు, పరవాడ, సబ్బవరం మండలాల్లో విజిటబుల్‌ క్లస్టర్లుగా, దేవరాపల్లి మండలాన్ని మాంసపు ఉత్పత్తుల కేంద్రంగా అభివృద్ధి చేయాలని డీఆర్‌డీఏ, పశు సంవర్థక శాఖల ద్వారా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉపాధి హామీ పథకంలో భాగంగా అన్ని మండలాల పరిఽధిలో పంట కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టాం. జలాశయాల ఆధునికీకరణకు, పోలవరం ఎడమ కాలువ పనుల పూర్తికి అవసరమైన చర్యలు చేపడుతున్నాం.

ప్రశ్న: విద్య, వైద్య పరంగా సాధించిన ప్రగతి ఏమిటి?

కలెక్టర్‌: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నాం. ఈ ఏడాది కొత్తగా ఇంటర్‌ విద్యార్థులకు కూడా సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నాం. ఇంటర్‌, హైస్కూల్‌ విద్యార్థులకు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లను పంపిణీ చేశాం. పాఠశాలలు తెరిచే నాటికే మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేశాం. అనకాపల్లిలో త్వరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కానుంది. బుచ్చెయ్యపేట, రాంబిల్లి మండలం పంచదార్లలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాం. అచ్యుతాపురంలో కార్మికుల కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రి త్వరలోనే అందుబాటులోకి రానుంది. అనకాపల్లిలో ఎన్టీఆర్‌ ఆస్పత్రి ప్రాంగణంలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.

Updated Date - Jul 12 , 2025 | 12:14 AM