Share News

జిల్లా యంత్రాంగం అప్రమత్తం

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:56 PM

మొంథా తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఆర్‌డీవో లోకేశ్వరరావు, మండల ప్రత్యేకాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లా యంత్రాంగం అప్రమత్తం
హుకుంపేటలో పర్యటిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

మొంథా తుఫాన్‌ నేపథ్యంలో ముమ్మర పర్యవేక్షణ

హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లో కలెక్టర్‌, అనంతగిరి మండలంలో ఇన్‌చార్జి జేసీ పర్యటన

పరిస్థితులను సమీక్షించి సూచనలు

ప్రతి మండలంలో ప్రత్యేకాధికారులు, సిబ్బంది తక్షణ చర్యలు

పాడేరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఆర్‌డీవో లోకేశ్వరరావు, మండల ప్రత్యేకాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 22 మండలాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేస్తున్నారు. మండల ప్రత్యేకాధికారులు, మండల, గ్రామ స్థాయిలోని అధికారులు బృందాలు, పోలీసులు ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రదేశాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. హుకుంపేట మండలం చీడిపుట్టు గెడ్డ, డుంబ్రిగుడ మండలం కొర్రా గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆయా ప్రాంతాలను స్వయంగా సందర్శించారు. అక్కడి పరిస్థితులను సమీక్షించి, అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. జిల్లాలోని పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో అనంతగిరి మండలంపైనే మొంథా ప్రభావం అధికంగా ఉండడంతో ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ హుటాహుటిన అనంతగిరి వెళ్లి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. అవసరమైన సహాయక, పునరావాస చర్యలు చేపట్టి, పలు ప్రాంతాల్లో గిరిజనులను పునరావాస కేంద్రాలకు తరలించారు. గ్రామ స్థాయి నుంచి మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో అధికారుల బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేపడుతుండడంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు.

Updated Date - Oct 28 , 2025 | 11:56 PM