నేటి నుంచి రాజ్‌మా విత్తనాల పంపిణీ
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:51 PM
జిల్లా వ్యాప్తంగా రాజ్‌మా విత్తనాలను సోమవారం నుంచి వ్యవసాయ అధికారులు పంపిణీ చేయనున్నారు. ఏపీ సీడ్స్ నుంచి రాజ్‌మా విత్తనాలను రైతులకు అందజేసేందుకు రైతు సేవా కేంద్రాలకు తరలించారు.
90 శాతం రాయితీపై అందజేత
చింతపల్లి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా రాజ్‌మా విత్తనాలను సోమవారం నుంచి వ్యవసాయ అధికారులు పంపిణీ చేయనున్నారు. ఏపీ సీడ్స్ నుంచి రాజ్‌మా విత్తనాలను రైతులకు అందజేసేందుకు రైతు సేవా కేంద్రాలకు తరలించారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు ముందస్తు రబీ పంటగా రాజ్‌మా సాగు చేస్తున్నారు. సెప్టెంబరు మొదటి వారం నుంచి రైతులు రాజ్‌మా నాట్లు వేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను వ్యవసాయశాఖ ద్వారా అందజేస్తున్నది. విత్తనాలను 90 శాతం రాయితీ పంపిణీ చేస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలో రైతులు కేవలం 10 శాతం మాత్రమే చెల్లించి విత్తనాలు పొందవచ్చు. రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు నఖలు రైతు సేవా కేంద్రాలకు తీసుకు వెళ్లి విత్తనాలు తీసుకోవచ్చు. ఎకరానికి 20 కిలోల విత్తనాలు అందజేయనున్నారు. ఈ ఏడాది విత్తనశుద్ధి చేసుకునే మందులను 50 శాతం రాయితీపై అందజేస్తున్నారు. అలాగే 50 శాతం రాయితీపై వేప నూనె కూడా వచ్చే నెలలో రైతులకు అందజేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 9,800 ఎకరాలకు అవసరమైన 4,900 క్వింటాళ్ల విత్తనం పంపిణీకి సిద్ధం చేశారు.