25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
ABN , Publish Date - Aug 04 , 2025 | 11:47 PM
రాష్ట్రంలోని అర్హులకు ఈ నెల 25 నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్
అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని సూచన
త్వరలో రేషన్ దుకాణాల ద్వారా మరింత మెరుగైన సేవలు
పాడేరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అర్హులకు ఈ నెల 25 నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో పౌరసరఫరాల శాఖ కమిషన్ సౌరభ్‌గౌర్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రూపొందించిన కొత్త రేషన్(స్మార్ట్) కార్డులను 25 నుంచి పంపిణీ చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 46 లక్షల మందికి కొత్త కార్డులు అందిస్తామన్నారు. ఈ క్రమంలో కార్డుల ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. దేశంలో రేషన్‌కార్డుల ఈకేవైసీ 96.40 శాతం చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. దీపం గ్యాస్ కనెక్షన్ల డెలివరీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా అధికారులు చూడాలన్నారు. రానున్న రోజుల్లో రేషన్ దుకాణాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి ప్రజల సమస్యలు గుర్తించి పరిష్కరించాలన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకం, కార్యక్రమం ప్రజలకు చేరువకావాలన్నారు.
గ్యాస్ కనెక్షన్ల ఈకేవైసీ తప్పనిసరి
వాడుకలో ఉన్న అన్ని రకాల గ్యాస్ కనెక్షన్ల ఈకేవైసీ తప్పనిసరిగా చేయించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్‌గౌర్ అన్నారు. జిల్లాలో గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి కేవలం 25 శాతం మాత్రమే ఈకేవైసీ జరిగిందని, దానిని శతశాతం పూర్తి చేయాలన్నారు. అంతకు ముందు జిల్లాలో పౌరసరఫరాల వ్యవస్థ అందిస్తున్న సేవలను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, జీసీసీ ఎండీ కల్పనాకుమారి, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, వర్కువల్‌గా రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు సింహాచలం, అపూర్వభరత్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.