Share News

నేటి నుంచి రేషన్‌ డిపోల్లో సరకుల పంపిణీ

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:22 AM

నాలుగేళ్ల తరువాత రేషన్‌ డిపోల డీలర్లు తమ దుకాణాల ద్వారా కార్డుదారులకు సరకులు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఒకటో తేదీ నుంచి సరకుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రేషన్‌ డిపోల ద్వారా కాకుండా వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్‌ సరకుల పంపిణీ అని చెప్పి రోడ్లపైనే ఎండలో నిలబెట్టి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

నేటి నుంచి రేషన్‌ డిపోల్లో సరకుల పంపిణీ
తూనిక యంత్రాలను తనిఖీ చేస్తున్న అధికారి శ్రీనివాస్‌

- సన్నద్ధమవుతున్న డీలర్లు

- తూనిక యంత్రాలను తనిఖీ చేసిన అధికారులు

అనకాపల్లి టౌన్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల తరువాత రేషన్‌ డిపోల డీలర్లు తమ దుకాణాల ద్వారా కార్డుదారులకు సరకులు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఒకటో తేదీ నుంచి సరకుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రేషన్‌ డిపోల ద్వారా కాకుండా వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్‌ సరకుల పంపిణీ అని చెప్పి రోడ్లపైనే ఎండలో నిలబెట్టి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చాక కార్డుదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించింది. రేషన్‌ పంపిణీ వాహనాలు ఎప్పుడు వస్తాయో?, ఎక్కడ ఉంటాయో తెలియక రోజువారీ కూలీలు పనులు మానుకొని నిరీక్షించడం, కొందరు రేషన్‌ సరకులు తీసుకోకపోవడాన్ని ప్రభుత్వం గమనించింది. దీంతో ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి రేషన్‌ డిపోల ద్వారానే సరకుల పంపిణీకి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నాలుగేళ్లుగా వినియోగంలో లేని ఎలక్ర్టానిక్‌ తూనిక యంత్రాలు సరిగా పనిచేస్తున్నది?, లేనిది? తూనికలు కొలతల శాఖ అధికారులతో డీలర్లు గత రెండు రోజులుగా తనిఖీలు చేయించుకోవడం ప్రారంభించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీనివాస్‌ అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాలకు చెందిన రేషన్‌డీలర్ల ఎలక్ర్టానిక్‌ తూనిక యంత్రాలను తనిఖీ చేసి రేషన్‌ సరఫరాలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మూడు మండలాలకు చెందిన 137 యంత్రాలను తనిఖీలు చేసి లబ్ధిదారులకు తూకంలో నష్టం కలగకుండా వాటిని సరి చేసి డీలర్లకు అందజేశారు.

సక్రమంగా సరకులు పంపిణీ జరగాలి

అనకాపల్లి: జిల్లాలో అన్ని రేషన్‌ దుకాణాల ద్వారా సరకులు సక్రమంగా పంపిణీ జరిగేలా మండలాధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 1,069 చౌక దుకాణాల ద్వారా రేషన్‌ పంపిణీ జరగాలన్నారు. జూన్‌ 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక దుకాణాల్లో సరకులు పంపిణీ చేయాలన్నారు. 65 సంవత్సరాలు దాటిన వారి ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌వో సత్యనారాయణరావు, మండలాల నుంచి వెబెక్స్‌లో అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:22 AM