ఆస్పత్రి నిర్వహణపై అసంతృప్తి
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:27 PM
మండలంలోని మారుమూల ఐనాడ, సలుగు పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో ఈదులపాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి, అక్కడ రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.

ఈదులపాలెం పీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్
రికార్డులు, మందుల నిల్వల పరిశీలన
నిర్వహణ తీరుపై అసహనం
మండలంలో విస్తృతంగా పర్యటన
కప్పరమజ్జి గ్రామంలో 28 జన్‌మన్ ఇళ్లకు భూమి పూజ
పాడేరు, మార్చి 12(ఆంధ్రజ్యోతి):
మండలంలోని మారుమూల ఐనాడ, సలుగు పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో ఈదులపాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి, అక్కడ రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అయితే ఆస్పత్రి నిర్వహణ సక్రమంగా లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసి, ఆస్పత్రిని మరింత మెరుగ్గా నిర్వహించాలన్నారు. పీహెచ్‌సీ అంబులెన్స్‌కు షెడ్ వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. కప్పరమజ్జి గ్రామంలో 28 పీఎం జన్‌మన్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మలకపొలం ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ముందుగా కలెక్టర్ మైదాన ప్రాంతమైన వి.మాడుగుల మండలానికి చేరువలో ఉన్న మండలంలోని ఐనాడ పంచాయతీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న జల్ జీవన్ మిషన్ పనులు, సచివాలయం, రైతు సేవా కేంద్రాలను పరిశీలించారు. సచివాలయంలో ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేదని గుర్తించారు. అక్కడ వృథాగా ఉన్న 5 వేల లీటర్ల వాటర్ ట్యాంక్‌ను గుర్తించి, దానిని అవసరమైన ప్రాంతానికి తరలించి వినియోగించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. తమ గ్రామంలో నాటుసారాకు పురుషులు బానిసలవుతున్నారని ఐనాడ గ్రామ మహిళలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన నవోదయం పేరిట నాటు సారా నిర్మూలనకు అవసరమైన చర్యలు చేపడతామని మహిళలకు తెలిపారు. అనంతరం రాయిపాలెం గ్రామాన్ని సందర్శించి జల్ జీవన్ మిషన్, రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించి, మే నాటికి రోడ్డు పనులు పూర్తి కావాలన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి అటవీ అనుమతులు రావాల్సి ఉందని కలెక్టర్‌కు అధికారులు తెలిపగా, ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. తమ ప్రాంతంలో పలువురు కాంట్రాక్టర్లు రహదారుల పనులను పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేని వెళ్లిపోతున్నారని స్థానికులు తెలిపారు. స్పందించిన కలెక్టర్ సదరు కాంట్రాక్టర్ ట్రాక్‌ను రికార్డు చేసి తగిన చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. తరువాత మలకపొలం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి, ఆంగ్లంలో చక్కని ప్రతిభ చూపడంతో ఆంగ్ల ఉపాధ్యాయుడు రామారావును కలెక్టర్ అభినందించారు. అక్కడ ఉపాధ్యాయులకు జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ తరగతులను కలెక్టర్ స్వయం పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచి సీ, డీ గ్రేడుల విద్యార్థులను ఏ, బీ గ్రేడుల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.
పెరిగిన గృహ నిర్మాణ వ్యయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
గిరిజన లబ్ధిదారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెంచిన గృహ నిర్మాణ వ్యయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ సూచించారు. కప్పరమజ్జి గ్రామంలో 28 ప్రధాన మంత్రి జన్‌మన్ యోజన ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్ భూమి పూజ చేశారు. ఈ క్రమంలో తమ గ్రామానికి వచ్చిన కలెక్టర్ దినేశ్‌కుమార్‌కు గిరిజనులు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణంలో గిరిజన లబ్ధిదారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం సాధారణ గిరిజనులకు రూ.75 వేలు, ఆదిమ జాతి గిరిజనులకు రూ. లక్ష అదనంగా నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. ఇళ్ల లబ్ధిదారులకు హౌసింగ్, ఇంజనీరింగ్ అధికారులు సంపూర్ణంగా సహకరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో హౌసింగ్ పీడీ బి.బాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కేఎస్.జవహర్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎల్.రజని, తహసీల్దార్ వి.త్రినాథరావునాయుడు, టీడబ్ల్యూ ఏఈఈ దుర్గాప్రసాద్, హౌసింగ్ ఏఈఈ ఈశ్వర్‌రాజు, ఎంపీటీసీ సభ్యురాలు ఎర్రయ్యమ్మ, సర్పంచ్ జి.అప్పలకొండ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.