బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు అంతరాయం
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:19 AM
జిల్లా కేంద్రం పాడేరుతో సహా పలు మండలాల్లో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) సేవలకు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారి పనులు చేపడుతున్న క్రమంలో రోడ్డు పక్కన ఉన్న ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు తెగిపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని బీఎస్‌ఎన్ ఎల్ సిబ్బంది తెలిపారు. దీంతో గత నాలుగు రోజులుగా బీఎస్‌ఎన్‌ఎల్ సెల్, ఇంటర్నెట్ సేవలు సక్రమంగా అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఎట్టకేలకు మంగళవారం రాత్రి సేవలు పునరుద్ధరించారు.

- హైవే నిర్మాణ పనుల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు కట్ కావడమే కారణం
- నాలుగు రోజుల పాటు అవస్థలు పడిన వినియోగదారులు
- ఎట్టకేలకు మంగళవారం రాత్రి సేవలు పునరుద్ధరణ
- హైవే, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో తరచూ సమస్య
పాడేరు, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి):
జిల్లా కేంద్రం పాడేరుతో సహా పలు మండలాల్లో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) సేవలకు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారి పనులు చేపడుతున్న క్రమంలో రోడ్డు పక్కన ఉన్న ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు తెగిపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని బీఎస్‌ఎన్ ఎల్ సిబ్బంది తెలిపారు. దీంతో గత నాలుగు రోజులుగా బీఎస్‌ఎన్‌ఎల్ సెల్, ఇంటర్నెట్ సేవలు సక్రమంగా అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఎట్టకేలకు మంగళవారం రాత్రి సేవలు పునరుద్ధరించారు.
ప్రస్తుతం కొయ్యూరు నుంచి చింతపల్లి మండలం లంబసింగి, జి.మాడుగుల మండలం వంజరి మీదుగా పాడేరుకు జాతీయ రహదారి 516-ఈ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎక్స్‌కవేటర్లతో రోడ్డు తవ్వుతున్నప్పుడు రోడ్డుకు పక్కన గతంలో వేసిన బీఎస్‌ఎన్‌ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను సైతం తవ్వేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు తెగిపోతున్నాయి. దీంతో పాడేరుతో పాటు ఇతర ప్రాంతాలకు బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. శనివారం నుంచి జిల్లా కేంద్రం పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో సెల్, ఇంటర్నెట్ సేవలు అందని దుస్థితి కొనసాగుతున్నది. కేవలం బీఎస్‌ఎన్‌ఎల్ సేవలపై ఆధారపడే వినియోగదారులు అవస్థలు పడ్డారు. అయితే ఎట్టకేలకు మంగళవారం రాత్రి 8 గంటలకు పూర్తిస్థాయిలో సేవలను పునరుద్ధరించారు.
అధికారుల మధ్య సమన్వయ లోపం
హైవే, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు అంతరాయం ఏర్పడిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు పక్కన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేసే క్రమంలో అక్కడ వాటిని గుర్తించే అధికారులు చర్యలు చేపట్టడం లేదు. అలాగే రోడ్డు నిర్మాణానికి పనులు చేపడుతున్నప్పుడు హైవే అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులను సంప్రతించి, పనులు జరుగుతున్న క్రమంలో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు తెగిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడడం, లేదా తెగిన వెంటనే అతికించుకునేలా సిబ్బందిని సిద్ధం చేయాలి. కానీ ఆయా అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో అటువంటి చర్యలు చేపట్టకుండా వినియోగదారులకు నరకం చూపిస్తున్నారు. ఇకనైనా హైవే, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు సయన్వయంతో వ్యవహరించి తమకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.