కలెక్టర్ ఉత్తర్వులు బేఖాతరు!
ABN , Publish Date - Jun 26 , 2025 | 01:19 AM
ప్రభుత్వ శాఖల్లో ‘రెవెన్యూ’ చాలా కీలకం. అందులో తహశీల్దారు పోస్టు అంటే మరీ ప్రత్యేకం. విశాఖ జిల్లాలో తహశీల్దారు ఉద్యోగం అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆ పోస్టును, నగరాన్ని విడిచిపెట్టి వెళ్లేందుకు ఒక పట్టాన ఎవరూ ఇష్టపడరు. నిబంధనల ప్రకారం బదిలీ చేసినా కదలరు. ఏదోవిధంగా కొనసాగేందుకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తుంటారు.
ఇటీవల తహశీల్దార్ల బదిలీలు
రిలీవై కొత్త స్థానాల్లో చేరేందుకు పలువురు ససేమిరా
ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిళ్లు
ఉత్తర్వులు రద్దు చేయడం కుదరదన్న కలెక్టర్
విశాఖపట్నం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ శాఖల్లో ‘రెవెన్యూ’ చాలా కీలకం. అందులో తహశీల్దారు పోస్టు అంటే మరీ ప్రత్యేకం. విశాఖ జిల్లాలో తహశీల్దారు ఉద్యోగం అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆ పోస్టును, నగరాన్ని విడిచిపెట్టి వెళ్లేందుకు ఒక పట్టాన ఎవరూ ఇష్టపడరు. నిబంధనల ప్రకారం బదిలీ చేసినా కదలరు. ఏదోవిధంగా కొనసాగేందుకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తుంటారు.
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా ఈనెల రెండో వారంలో చేపట్టిన బదిలీల్లో నగరంలో పలువురు తహశీల్దార్లను కలెక్టర్ బదిలీ చేశారు. అదే విధంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో మరికొందరు తహశీల్దార్లు/తత్సమాన కేడర్ అధికారులకు బదిలీలు అయ్యాయి. జిల్లా విషయానికి వస్తే...బదిలీ అయిన వారిలో ఆనందపురం, పెందుర్తి, ములగాడ, గాజువాక, సీతమ్మధార తహశీల్దార్లు ఉన్నారు. వీరిలో ఆనందపురం తహశీల్దార్ శ్యాంప్రసాద్‌ను కలెక్టరేట్‌లో కో-ఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేయగా, వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. ములగాడ తహశీల్దారు భుజంగరావు అనకాపల్లి జిల్లాకు బదిలీ కాగా ఆయన కూడా అక్కడ డీటీకి బాధ్యతలు అప్పగించి వెళ్లిపోయారు. మిగిలిన గాజువాక, పెందుర్తి, సీతమ్మధార తహశీల్దార్లు బదిలీ చేసిన స్థానాలకు వెళ్లలేదు. జిల్లాలో ఉండిపోవాలనే అనేక రకాలుగా పైరవీలు చేసి కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే బదిలీల రద్దుకు కలెక్టర్ అంగీకరించలేదు. గాజువాక తహశీల్దార్ శ్రీవల్లీ వీఎంఆర్‌డీఏ స్పెషల్ తహశీల్దారుగా పనిచేయడానికి ఇష్టపడలేదు. అమరావతిలో భూపరిపాలనా ముఖ్య కమిషనరేట్ నుంచి రెండేళ్ల పాటు తహశీల్దారుగా పనిచేయడానికి వచ్చిన ఆమె...కాలపరిమితి ముగిసిన తరువాత తనకున్న పలుకుబడితో మరో ఏడాదికి అనుమతి తీసుకున్నారు. అయితే ఆమెను తాజా బదిలీల్లో వీఎంఆర్‌డీఏకు బదిలీ చేయగా అక్కడ పనిచేయడానికి విముఖత చూపుతూ ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చినా కలెక్టర్ అంగీకరించలేదు. దీంతో తహశీల్దారు బాధ్యతలను గాజువాకలో డీటీకి అప్పగించి తిరిగి భూపరిపాలనా ముఖ్య కమిషనరేట్‌కు వెళ్లేందుకు దరఖాస్తు చేశారు.
పెందుర్తి తహశీల్దారుగా పనిచేసిన ఆనందకుమార్‌ను అనకాపల్లి జిల్లాకు బదిలీ చేస్తే బాధ్యతల నుంచి రిలీవ్ అయినా...అక్కడకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. విశాఖ జిల్లాలో ఏదో ఒక మండలంలో పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. సీతమ్మధార తహశీల్దార్ రమేష్‌ను ములగాడ తహసీల్దారుగా బదిలీ చేస్తే అప్రాఽధాన్యమైన మండలంగా భావించారేమోగానీ...బుధవారం వరకూ అక్కడ చేరలేదు. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారని తెలిసింది. ముగ్గురు తహశీల్దార్లూ కలెక్టర్ ఆదేశాలను పాటించక పోవడాన్ని రెవెన్యూ శాఖలో పలువురు తప్పుబడుతున్నారు. ఇదిలావుండగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వచ్చిన ఎంవీవీఎస్ ప్రసాద్ అనే తహశీల్దారును కలెక్టరేట్‌లో భూపరిరక్షణ విభాగం తహశీల్దారుగా నియమిస్తే...అది అప్రాధాన్యమైన పోస్టుగా భావించి విధుల్లో చేరలేదనే వాదన వినిపిస్తోంది. మిగిలిన ప్రభుత్వ శాఖల్లో బదిలీ ఉత్తర్వులు వెలువడిన వెంటనే రిలీవై కొత్త స్థానాల్లో చేరిపోయారు. అటువంటిది రెవెన్యూలో పలువురు మొండికేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి అధికారి తహశీల్దారుగా, అది కూడా గాజువాక, పెందుర్తి, ఆనందపురం, భీమిలి, విశాఖ రూరల్ మండలాల్లో అయితేనే చేస్తామనే ధోరణిలో ఉండడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు చెబుతున్నారు.