Share News

రాజకీయ ప్రయోజనం కోసమే గూగుల్‌పై అసత్య ప్రచారం

ABN , Publish Date - Oct 23 , 2025 | 01:24 AM

విశాఖపట్నంలో ఏర్పాటుకానున్న గూగుల్‌ డేటా సెంటర్‌పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం శాసనసభా ఫిర్యాదుల కమిటీ సమీక్షకు హాజరైన ఆయన అనంతరం చైర్మన్‌ రఘురామకృష్ణరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ గూగుల్‌ సంస్థ విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు రూ.1.3 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతుందన్నారు.

రాజకీయ ప్రయోజనం కోసమే  గూగుల్‌పై అసత్య ప్రచారం
మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

విపక్షాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజం

విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఏర్పాటుకానున్న గూగుల్‌ డేటా సెంటర్‌పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం శాసనసభా ఫిర్యాదుల కమిటీ సమీక్షకు హాజరైన ఆయన అనంతరం చైర్మన్‌ రఘురామకృష్ణరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ గూగుల్‌ సంస్థ విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు రూ.1.3 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతుందన్నారు. దీంతో విశాఖలో ఐటీ రంగం విస్తరణకు అనువైన వాతావరణం నెలకొంటుందన్నారు. డేటా సెంటర్‌ రాకతో ప్రపంచపటంలో విశాఖ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ చొరవతో విశాఖకు ఐటీ దిగ్గజ కంపెనీలు వస్తున్నాయని పల్లా శ్రీనివాసరావు అన్నారు. వారి కృషి ఫలితంగానే గూగుల్‌ విశాఖకు వచ్చిందని, అయితే కొందరు డేటా సెంటర్‌ వస్తే ఇబ్బందులు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. స్వప్రయోజనాలు, స్వలాభాల కోసం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. విపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, వీలైతే ప్రజలకు అవగాహన కల్పించాలి తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుదోవ పట్టించకూడదన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి సమపాళ్లలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకువెళుతుందన్నారు. పార్టీ నాయకులంతా పరిశ్రమల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలకు ప్రజలకు వివరించాలన్నారు.

వైఎస్‌ హయాంలో బ్రాండిక్స్‌కు ఎకరా రూపాయికే ఇచ్చారు

అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

గూగుల్‌ రాకతో విశాఖకు మరికొన్ని కంపెనీలు వస్తాయని అనకాపల్లి శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ అన్నారు. బుధవారం శాసనసభా ఫిర్యాదుల కమిటీ సమీక్షకు హాజరైన ఆయన అనంతరం కలిసి విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ, విశాఖలో టీసీఎస్‌, మరికొన్ని కంపెనీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖలో టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకే ఇచ్చారని తప్పుబడుతున్నారని, రాజశేఖర్‌రెడ్డి హయాంలో అచ్యుతాపురంలో బ్రాండిక్స్‌ కంపెనీకి ఎకరా రూపాయికే ఇచ్చారని కొణతాల గుర్తుచేశారు.

Updated Date - Oct 23 , 2025 | 01:24 AM