మాక్‌డ్రిల్‌లో అపశ్రుతి
ABN , Publish Date - Jul 24 , 2025 | 01:25 AM
ఓ సంస్థలో నిర్వహించిన మాక్‌డ్రిల్‌లో భాగంగా పేల్చిన బాంబు నుంచి శకలం రోడ్డుపై ఉన్న బాలికకు తగలడంతో గాయమైంది. ఈ సంఘటన ఆటోనగర్ బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) సంస్థలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
రోడ్డుపై ఉన్న బాలికకు గాయాలు
ఆటోనగర్ బీడీఎల్ వద్ద సంఘటన
కూర్మన్నపాలెం, జూలై 23 (ఆంధ్రజ్యోతి):
ఓ సంస్థలో నిర్వహించిన మాక్‌డ్రిల్‌లో భాగంగా పేల్చిన బాంబు నుంచి శకలం రోడ్డుపై ఉన్న బాలికకు తగలడంతో గాయమైంది. ఈ సంఘటన ఆటోనగర్ బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) సంస్థలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
మంగళవారం రాత్రి మాక్ డ్రిల్ నిర్వహించనున్నామని బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆటోనగర్ బీడీఎల్ అధికారులు దువ్వాడ పోలీసులకు లేఖ రాశారు. దీంతో యాదవజగ్గరాజుపేట నుంచి ఫకీరుతఖ్యా మార్గంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ రహదారిలో వాహనాలను బీడీఎల్ ప్రధాన గేటుకు ఇరువైపులా కొద్దిదూరంలో నిలిపివేశారు. మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్న సమయంలో దువ్వాడకు చెందిన బొమ్మిడి సురేంద్రవర్మ భార్య పద్మజ, కూతురు మనస్వి (8), కుమారుడు సాకేత వర్మతో కలసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పోలీసులు రోడ్డుపై నిలిపివేశారు. అదే సమయంలో సంస్థలో చేపట్టిన పేలుళ్లతో ఓ బాంబు శకలం సురేంద్రవర్మ చేతిని తాకి, అతని కుమార్తె మనస్వి కుడి బుగ్గను చీల్చుకుంటూ వెళ్లిపోయింది. పాపను హుటాహుటిన దువ్వాడ రైల్వేస్టేషన్ రోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటనలో పాపకు రక్తం కారుతుండడంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయమై బుధవారం ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించారు. పోలీసుల వ్యవహారశైలిపై మండిపడ్డారు. చిన్నారికి గాయమైనా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశాన్ని కలెక్టర్, సీపీ దృష్టికి తీసుకువెళ్లానన్నారు. బీడీఎల్ అధికారులపై కేసు నమోదు చేయకపోవడం సరికాదన్నారు. చిన్నారి చికిత్స బాధ్యతను ఎవరు వహిస్తారని ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు.
ఈ ఘటన గురించి దువ్వాడ సీఐ కె.మల్లేశ్వరరావు వద్ద ప్రస్తావించగా, బాంబులు పేల్చిన సమయంలో బందోబస్తులోని సిబ్బందికి, మాక్‌డ్రిల్‌లో ఉన్న కమెండోలకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఆ సమయంలో పలువురు ద్విచక్ర వాహనదారులు గేటు బయట రోడ్డుపై ఉన్నా ఎవరికీ గాయాలవ్వలేదని, ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించామన్నారు. దీనిపై ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని వివరించారు.