Share News

నిమజ్జనంలో అపశ్రుతి

ABN , Publish Date - Aug 31 , 2025 | 10:44 PM

మండలంలోని చింతలవీధి సమీపంలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. వినాయక విగ్రహం నిమజ్జనానికి ఊరేగింపుగా వెళుతున్న జనంపైకి వ్యాన్‌ దూసుకు వచ్చి ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

నిమజ్జనంలో అపశ్రుతి
మృతి చెందిన కొర్రా సీతారామ్‌, గంట కొండబాబు

వినాయక విగ్రహం ఊరేగింపుపైకి దూసుకొచ్చిన వ్యాన్‌

ఇద్దరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

డ్రైవర్‌ మద్యం మత్తే ప్రమాదానికి కారణం

పాడేరు మండలం చింతలవీధి కూడలి వద్ద ఘటన

పాడేరురూరల్‌, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతలవీధి సమీపంలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. వినాయక విగ్రహం నిమజ్జనానికి ఊరేగింపుగా వెళుతున్న జనంపైకి వ్యాన్‌ దూసుకు వచ్చి ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. చింతలవీధి గ్రామస్థులు నిమజ్జనానికి వినాయక విగ్రహాన్ని ఊరేగిస్తూ తీసుకు వెళుతుండగా, హుకుంపేట నుంచి పాడేరు వైపు వస్తున్న వ్యాన్‌ అతి వేగంగా వచ్చి వారిని ఢీకొంది. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా చెల్లాచెదురుగా తుళ్లిపోయారు. ఈ ప్రమాదంలో చింతలవీధి గ్రామానికి చెందిన కొర్రా సీతారామ్‌(61), గంట కొండబాబు(35)లు అక్కడికక్కడే మృతి చెందగా, కొర్రా విశ్వా, వంతాల దాలిమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. కొర్రా గోరమ్మ, గుంటా దత్తులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా వ్యాన్‌ డ్రైవర్‌ మద్యం తాగి వాహనాన్ని అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి రెండు మృతదేహాలను, క్షతగాత్రులను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అరకులోయ ఎంపీ తనూజరాణి ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ యజమాని, డ్రైవర్‌ వి.కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ డి.దీనబందు తెలిపారు.

Updated Date - Aug 31 , 2025 | 10:44 PM