Share News

అతిథులకు అవస్థలు

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:31 PM

జిల్లా కేంద్రం పాడేరులో ప్రభుత్వ అతిథి గృహాలు చాలా ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో వసతికి పర్యాటకులు, అతిథులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

అతిథులకు అవస్థలు
ఐదేళ్లుగా అభివృద్థికి నోచని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం

పాడేరులో ఉన్నవి రెండే అతిథి గృహాలు

అభివృద్ధికి దూరంగా రోడ్లు, భవనాల శాఖ

జడ్పీ అతిథి గృహంలో డీడీవో కార్యాలయం ఏర్పాటు

వసతికి ఇబ్బంది పడుతున్న పర్యాటకులు, అతిథులు

ప్రతిపాదనలకే పరిమితమైన రిసార్టుల నిర్మాణం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్రం పాడేరులో ప్రభుత్వ అతిథి గృహాలు చాలా ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో వసతికి పర్యాటకులు, అతిథులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. పాడేరులో రోడ్లు, భవనాల శాఖ, జిల్లా పరిషత్‌ అతిథి గృహాలు మాత్రమే ఉన్నాయి. అయితే వాటిని అభివృద్ధి చేసి, చక్కని వసతిని అందించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టడం లేదు. దీంతో చాలా ఏళ్లు అవి వినియోగానికి దూరంగా ఉన్నాయి.

ఎత్తైన ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే రెండు దశాబ్దాలుగా దానిని అదే విధంగా ఉంచారేగాని, కనీసం ఆధునికీకరించలేదు. అలాగే తాగునీరు, విద్యుత్‌ వంటి సదుపాయాలను సైతం మెరుగుపరచలేదు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో పర్యాటకులు దానిని వినియోగిస్తుండేవారు. కానీ ఐదేళ్లుగా కనీస నిర్వహణ లేకపోవడంతో అతిథి గృహం వినియోగానికి దూరమైంది. ఎక్కువ విస్తీర్ణం కలిగి, ఎత్తైన ప్రదేశంతో ఉన్న రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహాన్ని చక్కగా అభివృద్ధి చేస్తే వసతి పరంగా పర్యాటకులు, అతిథులకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు సంబంధిత శాఖకు చక్కని ఆదాయం సమకూరుతుంది. అయితే ఆ దిశగా అధికారులు దృష్టి సారించడం లేదు.

జడ్పీ అతిథి గృహంలో డీడీవో కార్యాలయం

పాడేరులో మరో అతిథి గృహం జిల్లా పరిషత్‌ది. దీని పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. అక్కడ విద్యుత్‌ ఉంటే... నీరు ఉండదు... ఇలా నిత్యం ఏదో సమస్యతో అతిథి గృహం వినియోగానికి చాలా ఏళ్లుగా దూరంగానే ఉంది. దీంతో జిల్లా పరిషత్‌ అతిథి గృహం అంటే అందరూ భయపడతారు. అయితే అప్పుడప్పుడు జిల్లా పరిషత్‌ అధికారులు అవసరమైన మరమ్మతులు చేపడుతున్నప్పటికీ నిర్వహణపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అది అధ్వానంగా మారింది. తాజాగా డివిజన్‌ డెవలప్‌మెంట్‌ అధికారి(డీడీవో) వ్యవస్థను ప్రవేశపెట్టడంతో దానికి మరమ్మతులు చేపట్టారు. దానిలోనే డీడీవో కార్యాలయం ఏర్పాటు చేశారు. దీంతో ఇక నుంచి జడ్పీ అతిఽథి గృహంలో ఇతరులకు వసతి సదుపాయం కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. పాడేరులో ఉన్న ఈ రెండు అతిథి గృహాల పరిస్థితి ఈ విధంగా ఉండడంతో అతిథులకు వసతి సమస్య తలెత్తుతోంది.

ప్రతిపాదనలకే పరిమితమైన టూరిజం రిసార్ట్సు

మండలంలో మినుములూరులో, డల్లాపల్లిలో టూరిజం రిసార్టులను నిర్మించాలని గతంలో ప్రతిపాదించినప్పటికి నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో వసతి సమస్య కొనసాగుతున్నది. పాడేరులో ఆశించిన స్థాయిలో వసతి సదుపాయాలు లేకపోవడంతో టూరిజం పరంగా అభివృద్ధి జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఇక్కడికి వచ్చిన పర్యాటకులు, అతిథులు బస చేసేందుకు చక్కని వసతి సదుపాయాలు లేవు. ఫలితంగా సందర్శకులకు వసతి పరంగా ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహాన్ని అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు టూరిజం ద్వారా రిసార్టుల నిర్మాణం చేపట్టాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.

Updated Date - Dec 17 , 2025 | 11:31 PM