సబ్‌జైలు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు?
ABN , Publish Date - Sep 07 , 2025 | 01:21 AM
వార్డర్‌పై సుత్తితో దాడి చేసి పట్టణంలోని సబ్‌జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారైన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. ఘటనకు సంబంధించి, సబ్‌జైలు అధికారులతో పాటు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
రిమాండ్ ఖైదీల పరారీ ఘటనపై అధికారుల సీరియస్
అనారోగ్యంతో ఉన్న సిబ్బందికి విధులు
ఖైదీలకు తప్పించుకునేందుకు అదే అవకాశం
వెలుగులోకి సబ్‌జైలు నిర్వహణ లోపాలు?
చోడవరం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
వార్డర్‌పై సుత్తితో దాడి చేసి పట్టణంలోని సబ్‌జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారైన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. ఘటనకు సంబంధించి, సబ్‌జైలు అధికారులతో పాటు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. విధుల్లో ఉన్న వార్డర్‌పై సుత్తితో దాడిచేసి, రిమాండ్ ఖైదీలు నక్కా రవికుమార్, బెజవాడ రాము తప్పించుకున్న వ్యవహారాన్ని పోలీసు. జైళ్ల శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించినట్టు తెలిసింది. ఘటన జరిగిన రోజు సబ్‌జైలు సూపరింటెండెంట్‌తో పాటు, వార్డర్, మరో నలుగురు గార్డులు విధుల్లో ఉన్నప్పటికీ, ఖైదీలు తమప్లాన్ అమలు చేసి పారిపోయినట్టు అధికారుల పరిశీలనలో బయటపడినట్టు సమాచారం.
సబ్‌జైలు నిర్వహణలో అధికారులు అనేక లోపాలు గుర్తించినట్టు చెబుతున్నారు. వాస్తవానికి సబ్‌జైలులో విధుల్లో ఉన్న పోలీసుల్లో ముగ్గురు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడం, తగినంత ఫిట్‌గా లేకపోవడంతో వార్డర్‌పై దాడి జరుగుతున్నా అడ్డుకునే స్థాయిలో స్పందించలేదని చెబుతున్నారు. దీనికితోడు మరో జైలు అధికారి వినికిడి లోపంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఖైదీల చేతిలో దాడికి గురైన వార్డర్‌తో పాటు, మరో వార్డర్ మినహా మిగిలిన వారంతా అనారోగ్య సమస్యలతోనే విధులు నిర్వహిస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది. వీరి పరిస్థితి గమనించిన తరువాతే ఖైదీలు, తమ ప్లాన్ పక్కాగా అమలుచేసి తప్పించుకున్నారని భావిస్తున్నారు. దీనికితోడు సబ్‌జైలులోని రెండో గేటు తెరిచి ఉంచడం తదితర నిర్లక్ష్య చర్యలు ఖైదీలు పారిపోవడానికి కారణంగా అంచనా వేస్తున్నారు. సబ్‌జైలు బయట కూడా భద్రతాపరమైన ఏర్పాట్లు లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది. సబ్‌జైలు ప్రాంగణంలో గదులు బాగానే ఉన్నప్పటికీ, ప్రహరీ శిథిలావస్థలో ఉంది. జైలు ఆవరణలో మినహా, గేటు బయట ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడం గమనార్హం. భద్రతాపరమైన లోపాలు, జైలు సిబ్బంది నియామకంలో అలసత్వం వంటి కారణాలు అధికారుల పరిశీలనలో బయటపడ్డాయని చెబుతున్నారు. కారణాలేవైనా హోంమంత్రి సొంత జిల్లాలో ఖైదీలు పారిపోయిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. దీంతో బాఽధ్యులపై క్రమశిక్షణ చర్యలకు అధికారులు సిద్ధమయినట్టు సమాచారం.