విపత్తుల నిర్వహణ ప్రణాళిక గ్రామస్థాయి నుంచి అమలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:04 AM
జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికను గ్రామస్థాయి నుంచి అమలు చేయాలని జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) జాయింట్ అడ్వైజర్ ఎన్.ప్రకాశ్ అధికారులను ఆదేశించారు.
ప్రతి శాఖా ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలి
ఎన్‌డీఎంఏ జాయింట్ అడ్వైజర్ ప్రకాశ్
అనకాపల్లి కలెక్టరేట్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికను గ్రామస్థాయి నుంచి అమలు చేయాలని జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) జాయింట్ అడ్వైజర్ ఎన్.ప్రకాశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్‌డీఎంఏ సీనియర్ అధికారుల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక నవీకరణ, డిజాస్టర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కార్యకలాపాలు, విపత్తుల సమయంలో ముప్పు తగ్గింపుతోపాటు భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనే వ్యవస్థ పటిష్ఠత తదితర అంశాలపై సమీక్షించి, సమన్వయ శాఖల అధికారులతో ఈ బృందం చర్చించింది. మాక్‌డ్రిల్స్ నిర్వహణ, సామర్థ్య నిర్మాణంపై అధికారులకు శిక్షణ, సమన్వయం వంటి అంశాల్లో చర్యలు బాగున్నాయని ప్రకాశ్ తెలిపారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సరైన సన్నద్ధత విషయంలో ప్రతి శాఖా ప్రత్యేక విపత్తు నిర్వహణ ప్రణాళికను రూపొందించడం కీలకమని చెప్పారు. చట్ట ప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలపై రియల్ టైమ్ హెచ్చరికల వ్యవస్థలో ‘సచేత్’ యాప్ కీలక మైలురాయి అని, దీనిపై అధికారులతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. విపత్తుల నిర్వహణ ప్రణాళికలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను పొందుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆపద మిత్ర, ఇతర వలంటీర్ సేవల్లో యువతను ప్రోత్సహించాలని బృందం సభ్యులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ(క్రైమ్) ఎల్.మోహన్‌రావు, ఎస్‌డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వి.నారాయణరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ బాలాజీ, డీపీవో సందీప్, జిల్లా పశుసంవర్థక శాక అధికారి రామ్మోహనరావు, డీపీఆర్‌వో కేవీఎల్‌ఎన్ మూర్తి, అనకాపల్లి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.