జడ్పీ చైర్‌పర్సన్‌పై చల్లారని అసమ్మతి
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:00 AM
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రపై సొంత పార్టీలో మొదలైన అసంతృప్తి చల్లారినట్టు లేదు.
రెండుగా చీలిన వైసీపీ జడ్పీటీసీ సభ్యులు
నేడు దేవరాపల్లిలో జడ్పీటీసీ ఫోరం అధ్యక్షుడి విందు
చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం గురించి చర్చ
పార్టీ పెద్దలకు సమాచారం
విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రపై సొంత పార్టీలో మొదలైన అసంతృప్తి చల్లారినట్టు లేదు. ఆమెకు మద్దతుగా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం తయారైనట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో అవిశ్వాసం పెట్టాలనే ప్రతిపాదన మరోమారు తెరపైకి వచ్చినట్టు తెలిసింది.
వచ్చే నెల 23వ తేదీ నాటికి జడ్పీ చైర్‌పర్సన్‌గా సుభద్ర ఎన్నికై నాలుగు సంవత్సరాలు పూర్తి కానున్నది. నాలుగేళ్లు పూర్తయినట్టయితే అవిశ్వాసం పెట్టేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో సుభద్రపై అవిశ్వాస తీర్మానం కోసం నెల రోజుల నుంచి సొంత పార్టీకి చెందిన కొందరు సభ్యులు పావులు కదుపుతున్నారు. ఇది సభ్యుల మధ్య విభేదాలకు దారితీసి, ఫోరం అధ్యక్షుడిని మార్చేంత వరకూ వెళ్లింది. జడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ పైలా సన్యాసిరాజును కూడా మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలావుండగా జడ్పీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన కర్రి సత్యం (దేవరాపల్లి) సొంతూరు మామిడిపల్లిలో మంగళవారం ఆత్మీయ కలయిక పేరిట విందు సమావేశం ఏర్పాటుచేశారు. గ్రామ దేవత పండుగను పురస్కరించుకుని విందు ఇస్తున్నట్టు చెబుతున్నా బల ప్రదర్శన కోసమే ఈ సమావేశం ఏర్పాటుచేస్తున్నట్టు పార్టీలో ప్రచారం సాగుతుంది. విందు సమావేశానికి రావాలని జడ్పీ చైర్‌పర్సన్ సుభద్రను కూడా సత్యం ఆహ్వానించారు. అయితే తనపై కొందరు జడ్పీటీసీ సభ్యులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేయడం, పెద్దల ముందు పంచాయితీ నిర్వహించిన నేపథ్యంలో ఆత్మీయ కలయిక సమావేశానికి వెళ్లకూడదని చైర్‌పర్సన్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.
చైర్‌పర్సన్‌కు అనుకూలంగా ఉండే జడ్పీటీసీ సభ్యులు ఈ విందు సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా తమకు బాగా సన్నిహితంగా ఉండే సభ్యులను కూడా వెళ్లొద్దని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వ్యతిరేకవర్గం ఎక్కువ మంది మామిడిపల్లి వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఆత్మీయ కలయిక అనేది రాజకీయాల కోసం కాదని, కేవలం అందరం కలుసుకునేందుకు మాత్రమే ఈ సమావేశం ఏర్పాటుచేస్తున్నామని ఫోరం అధ్యక్షుడు కర్రి సత్యం సహచర సభ్యులకు పంపిన వాట్సాప్ ఆహ్వానంలో పేర్కొన్నారు. కాగా మంగళవారం దేవరాపల్లిలో విందు సమావేశం ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కొందరు రంగంలోకి దిగి మరోసారి రాజీ కుదిర్చేలా చర్చలు జరిపారని ప్రచారం సాగుతుంది. దీనికి సంబంధించి ఆదివారం నగరంలో ముఖ్య నేతలంతా భేటీ అయి చర్చించారని చెబుతున్నారు. చైర్‌పర్సన్ పదవీకాలం ఇంకా ఏడాది మాత్రమే ఉన్నందున ఇప్పుడు అవిశ్వాసం పెట్టి పార్టీని ఇరకాటంలో పెట్టడం కంటే మధ్యేమార్గంగా ఆలోచన చేయాలని భావిస్తున్నట్టు కొందరు సభ్యులు అంతర్గత సంభాషణలలో చర్చించుకుకున్నారు. మంగళవారం నాటి సమావేశం తరువాత సభ్యులందరితో మరోసారి విశాఖలో సమావేశం ఏర్పాటుచేయాలని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు.