Share News

తవ్వుకో.. అమ్ముకో..!

ABN , Publish Date - May 05 , 2025 | 12:46 AM

విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ భూముల్లో అక్రమార్కులు గ్రావెల్‌ తవ్వుకుపోతున్నారు. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఎక్స్‌కవేటర్లతో తవ్వకాలు జరిపి టిప్పర్లు, లారీల్లో రవాణా చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, కొత్తగా నిర్మిస్తున్న హేచరీలు, ఇతర కట్టడాల్లో పునాదులు నింపడానికి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

తవ్వుకో.. అమ్ముకో..!
డీఎల్‌పురం సమీపంలో ఏపీఐఐసీ భూముల్లో గ్రావెల్‌ తవ్వకాలతో ఏర్పడిన గోతులు

ఇండస్ర్టియల్‌ కారిడార్‌ భూముల్లో గ్రావెల్‌ దందా

రాత్రి వేళల్లో యంత్రాలతో తవ్వకాలు

టిప్పర్‌ లారీలు, ట్రాక్టర్లతో రవాణా

చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, కొత్త నిర్మాణాలకు తరలింపు

టీడీపీకి చెందిన ఒక ముఖ్య నేతపై ఆరోపణలు

పట్టించుకోని ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు

నక్కపల్లి, మే 4 (ఆంధ్రజ్యోతి): విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ భూముల్లో అక్రమార్కులు గ్రావెల్‌ తవ్వుకుపోతున్నారు. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఎక్స్‌కవేటర్లతో తవ్వకాలు జరిపి టిప్పర్లు, లారీల్లో రవాణా చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, కొత్తగా నిర్మిస్తున్న హేచరీలు, ఇతర కట్టడాల్లో పునాదులు నింపడానికి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, వేంపాడు, డీఎల్‌పురం రెవెన్యూ గ్రామాల పరిధిలో ఎనిమిదేళ్ల కిందట ఏపీఐఐసీ సుమారు 4,500 ఎకరాలను సేకరించారు. ఇంతకాలం ఖాళీగా వున్న ఈ భూముల్లో త్వరలో ప్రైవేటు స్టీల్‌ ప్లాంట్‌, బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు కానున్నాయి. మరికొద్ది రోజుల్లో వీటి నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం వుంది. దీంతో కారిడార్‌ భూముల్లో గ్రావెల్‌ తవ్వకాలకు అక్రమార్కులు తెగబడుతున్నారు. డీఎల్‌ పురం, వేంపాడు రెవెన్యూ పరిధి అమలాపురం- మూలపర్ర మధ్య వున్న ఏపీఐఐసీ భూముల్లో యంత్రాలతో గ్రావెల్‌ తవ్వి టిప్పర్‌లారీలు, ట్రాక్టర్లలో తరలించి వ్యాపారం సాగిస్తున్నారు. నక్కపల్లి మండలం బంగారమ్మపేట సమీపంలో నిర్మిస్తున్న భారీ హేచరీకి గ్రావెల్‌ తరలిస్తున్నట్టు తెలిసింది. ఇంకా పాయకరావుపేట, తుని ప్రాంతాల్లో వున్న హేచరీలకు కూడా గ్రావెల్‌ను తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ట్రిప్పర్‌ గ్రావెల్‌ రూ5 వేలు, ట్రాక్టర్‌ గ్రావెల్‌ రూ.800 నుంచి రూ.1,000కి విక్రయిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కీలక నేత గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సంబంధిత అధికారులు పట్టించుకోడంలేదని తెలిసింది.

తనిఖీ చేసి చర్యలు చేపడతాం

ఎస్‌.నరసింహారావు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌

ఇండస్ర్టియల్‌ కారిడార్‌ భూముల్లో అనుమతి లేకుండా గ్రావెల్‌ తవ్వినా, తరలించినా ఉపేక్షించేది లేదు. ఆయా గ్రామాల్లో గ్రావెల్‌ తవ్విన భూములను పరిశీలిస్తారు. గ్రావెల్‌ తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, గ్రావెల్‌ తవ్వకాలు జరిసేన యంత్రాలు, రవాణా చేసే వాహనాలను సీజ్‌ చేస్తాం.

Updated Date - May 05 , 2025 | 12:46 AM