గర్భిణులకు తీరిన కష్టాలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:35 PM
చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో సిజేరియన్ సేవలు అందుబాటులోకి రావడంతో గర్భిణుల కష్టాలు తీరాయి. ఇప్పటి వరకు ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు ప్రసవం కష్టమైతే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి, లేదా 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించాల్సి వచ్చేది.
చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో అందుబాటులోకి స్త్రీ వైద్యనిపుణులు, ఎనస్థీషియన్ సేవలు
మూడు నెలల క్రితం ఖాళీ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం
మూడేళ్ల తరువాత తొలి సిజేరియన్ విజయవంతం
చింతపల్లి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో సిజేరియన్ సేవలు అందుబాటులోకి రావడంతో గర్భిణుల కష్టాలు తీరాయి. ఇప్పటి వరకు ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు ప్రసవం కష్టమైతే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి, లేదా 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం మూడు నెలల క్రితం ఏరియా ఆస్పత్రిలో ఎనస్థీషియా, స్త్రీ వైద్యనిపుణుల పోస్టులను భర్తీ చేయడంతో ఇబ్బందులు తొలగాయి. బుధవారం వైద్య నిపుణులు మూడేళ్ల తరువాత తొలి సిజేరియన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో గర్భిణులు ఆనందం వ్యక్తం చేశారు.
చింతపల్లి ఏరియా ఆస్పత్రిని నాలుగేళ్ల క్రితం సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి ఏరియా ఆస్పత్రిగా స్థాయిని పెంచిన విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం నాటి మెడికల్ కౌన్సెల్ సభ్యుడు తమర్భ నరసింగరావు స్థానిక ఏరియా ఆస్పత్రిలో సిజేరియన్ ప్రారంభించారు. అనంతరం ఎనస్థీషియన్ బదిలీకాగా, స్త్రీ వైద్యనిపుణులు రెండేళ్లుగా విధులకు దూరం కావడంతో సిజేరియన్లు నిలిచిపోయాయి. నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న ఎనస్థీషియా, స్త్రీ వైద్యనిపుణుల పోస్టులను భర్తీ చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పోస్టులను భర్తీ చేసింది. మూడు నెలల క్రితం ఈ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న స్త్రీ వైద్యనిపుణులు, ఎనస్థీషియా పోస్టులు భర్తీ అయ్యాయి. దీంతో గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య తనిఖీలు, ఆలా్ట్రసౌండ్ స్కానింగ్‌లు జరుగుతున్నాయి.
నాలుగు మండలాలకు పెద్దదిక్కు
ఏరియా ఆస్పత్రి జీకేవీధి మండలాలతో పాటు కొయ్యూరు, జి.మాడుగుల సరిహద్దు గ్రామాల రోగులు, గర్భిణులకు పెద్దదిక్కు. ఏరియా ఆస్పత్రికి నాలుగు మండలాల నుంచి రోగులు, గర్భిణులు, బాలింతలు వస్తుంటారు. ఏరియా ఆస్పత్రికి అనుబంధంగా ఐటీడీఏ నిర్వహణలో ఉన్న గర్భిణుల వసతి గృహం అందుబాటులో ఉంది. గర్భిణులు ప్రసవ సమయానికి పది రోజులు ముందుగా ఈ వసతి గృహంలో చేరుతుంటారు. పురిటినొప్పులు రాగానే ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్యులు ప్రసవం చేస్తున్నారు. ప్రతి రోజు ఏరియా ఆస్పత్రిలో ఆరు నుంచి ఎనిమిది సహజ ప్రసవాలు జరుగుతున్నాయి. 10 నుంచి 15 మంది గర్భిణులు ప్రసవం వసతి గృహంలో నిరీక్షిస్తున్నారు.
గర్భిణులకు తీరిన వేదన
స్థానిక ఏరియా ఆస్పత్రిలో సిజేరియన్లు అందుబాటులోకి రావడంతో ఆదివాసీ గర్భిణులకు ప్రసవ వేదన తీరింది. గతంలో ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు ప్రసవం కష్టమైతే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి, లేదా 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించాల్సి వచ్చేది. దీంతో గర్భిణులు పురిటినొప్పులతో అంబులెన్సులో సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి అవస్థలు పడేవారు. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యంలోనే ప్రసవం జరిగేది. ప్రస్తుతం ఈ పరిస్థితికి కూటమి ప్రభుత్వం ముగింపు పలికింది. ఏరియా ఆస్పత్రిలో స్త్రీ వైద్యనిపుణులు డాక్టర్ వాసవి, డాక్టర్ శ్రీలత, ఎనస్థీషియా డాక్టర్ సాహితి అందుబాటులో ఉన్నారు. ఏరియా ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్‌ను నాలుగు నెలల క్రితం ఆధునికీకరించారు. ఆస్పత్రిలో చింతపల్లి మండలం బైలుకించంగి గ్రామానికి చెందిన కుడుముల ఝాన్సీకి ప్రసవం కష్టమైంది. దీంతో స్త్రీ వైద్యనిపుణులు, ఎనస్థీషియన్ వెంటనే సిజేరియన్‌కు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం సిజేరియన్‌ను స్త్రీ వైద్యనిపుణులు, ఎనస్థీషియన్ సమర్థవంతంగా చేశారు. తొలి సిజేరియన్ విజయవంతంగా పూర్తి చేసిన స్త్రీ వైద్యనిపుణులు డాక్టర్ వాసవి, డాక్టర్ శ్రీలత, ఎనస్థీషియన్ సాహితిలను ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.నీలవేణి అభినందించారు.