Share News

మన్యంలో విభిన్న వాతావరణం

ABN , Publish Date - Aug 16 , 2025 | 10:37 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మన్యంలో శనివారం విభిన్నమైన వాతావరణం నెలకొంది.

మన్యంలో విభిన్న వాతావరణం
పాడేరు ఘాట్‌లో పన్నెండోమైలు వద్ద భారీ వర్షం

పాడేరు ఘాట్‌లో వర్షం.. ఆపై పొగమంచు

పాడేరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మన్యంలో శనివారం విభిన్నమైన వాతావరణం నెలకొంది. గత కొన్నాళ్లుగా ఏజెన్సీలో ముసురు వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దానికి అల్పపీడనం తోడు కావడంతో ఎప్పుడు ఎటువంటి వాతావరణం నెలకొంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. శనివారం తెల్లవారుజామున పొగమంచు కురవగా ఉదయం వేళలో జల్లులతో కూడిన వర్షం పడింది. కాని పది గంటల తర్వాత మబ్బు వాతావరణం నెలకొంది. మళ్లీ ఒంటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. అయితే జిల్లా కేంద్రం పాడేరులో కంటే ఘాట్‌ మార్గంలో కుండపోతగా వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సుమారు గంట సమయం భారీ వర్షం కురిసింది. దీంతో ఘాట్‌లోని మంచు మేఘాలు అలముకున్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే స్థానిక ఘాట్‌ మార్గంలో భారీ వర్షం. మంచు మేఘాలతో విభిన్నమైన వాతావరణం నెలకొంది.

స్థిరంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు

మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతున్నా గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. దీంతో శనివారం కొయ్యూరులో 32.9 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా జి.మాడుగులలో 28.8, అనంతగిరిలో 28.6, చింతపల్లిలో 27.7, పాడేరులో 27.6, పెదబయలులో 27.0, డుంబ్రిగుడలో 26.0, అరకులోయలో 25.7, ముంచంగిపుట్టులో 24.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Aug 16 , 2025 | 10:37 PM