మన్యంలో విభిన్న వాతావరణం
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:21 PM
మన్యంలో విభిన్నమైన వాతావరణం కొనసాగుతున్నది. కొద్ది రోజులుగా ఉదయం వేళ పొగమంచు, ఆ తరువాత తీవ్రమైన ఎండ, మధ్యాహ్నం వర్షం కురుస్తున్నది. సోమవారం ఉదయం కూడా ఉదయం ఎనిమిది గంటల వరకు పాడేరు, పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్మేసింది.
వేకువజామున మంచు, ఉదయం ఎండ, మధ్యాహ్నం వర్షం
కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి
చిత్తడిగా మారిన రహదారులు
పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు
పాడేరు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మన్యంలో విభిన్నమైన వాతావరణం కొనసాగుతున్నది. కొద్ది రోజులుగా ఉదయం వేళ పొగమంచు, ఆ తరువాత తీవ్రమైన ఎండ, మధ్యాహ్నం వర్షం కురుస్తున్నది. సోమవారం ఉదయం కూడా ఉదయం ఎనిమిది గంటల వరకు పాడేరు, పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వచ్చింది. ఆ తరువాత ఎండ తీవ్రత అధికంగా ఉంది. మధ్యాహ్నం పలు చోట్ల వర్షం కురిసింది.
కొనసాగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
ఏజెన్సీలో నిత్యం ఏదో ప్రాంతంలో వానలు కురుస్తున్నప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒక వైపు వర్షం కురిసినా, మరో వైపు ఎండల ప్రభావం సైతం అధికంగానే ఉంటున్నది. దీంతో జనం అల్లాడుతున్నారు. సోమవారం అరకులోయలో 32.4, కొయ్యూరు, పాడేరులో 32.2, పెదబయలులో 32.0, జి.మాడుగులలో 30.6, అనంతగిరిలో 30.3, డుంబ్రిగుడలో 29.7, జీకేవీధి, చింతపల్లిలో 29.5, హుకుంపేటలో 29.4, ముంచంగిపుట్టులో 27.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రెండు గంటల సేపు ఏకధాటిగా..
అరకులోయ: అరకులోయలో సోమవారం ఉదయం నుంచి ఎండ కాయగా, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రెండు గంటల సేపు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో జనజీవనానికి అంతరాయం కలిగింది.
చింతపల్లిలో..
చింతపల్లి: మండలంలో భారీ వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. అన్నవరం వారపు సంతలో వర్షానికి వర్తకులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.
హుకుంపేటలో..
హుకుంపేట: మండలంలో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు చిత్తడిగా మారాయి. చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. ఈ వర్షాలు వ్యవసాయ పనులకు అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల పరిధిలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే స్థానిక ప్రధాన రహదారిపై జనసంచారం తగ్గుముఖం పట్టింది. వర్షానికి వాగులు, గెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులు చిత్తడిగా మారాయి.
పెదబయలులో..
పెదబయలు: మండలంలోని సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పెదబయలు, రూఢకోట, గోమంగి, సీకరి, అరడకోట, గంపరాయి ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి జనజీవనానికి అంతరాయం కలిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాతావరణం సాధారణంగా ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. దీంతో పెదబయలు, రూఢకోట వారపు సంత ప్రాంతాలు చిత్తడిగా మారాయి. వర్తకులు, వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. పెదబయలు ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించింది.