మన్యంలో భిన్న వాతావరణం
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:05 PM
ఏజెన్సీలో బుధవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని దాదాపుగా అన్ని మండలాల్లోనూ తీవ్రమైన ఎండకాసింది. కానీ ఒడిశా రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు మండలంలో మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
ఒడిశా సరిహద్దులో భారీ వర్షం
మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత
పాడేరు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో బుధవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని దాదాపుగా అన్ని మండలాల్లోనూ తీవ్రమైన ఎండకాసింది. కానీ ఒడిశా రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు మండలంలో మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాడేరులో ఉదయం నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు తీవ్రమైన ఎండకాసింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి ఆకాశమంతా మేఘావృతమైంది. అప్పటి వరకు ఎండతో వేడిక్కిన వాతావరణం చల్లబడింది. దీంతో జనం కాస్త ఉరట చెందారు. అదే సమయంలో ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ముంచంగిపుట్టులో వర్షం కురవగా, ఇతర ప్రాంతాల్లో మబ్బుల వాతావరణం నెలకొంది.
పాడేరులో 35.8 డిగ్రీలు
మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పగటి వేళల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. బుధవారం పాడేరులో 35.8, కొయ్యూరులో 34.8, అరకులోయలో 32.6, జి.మాడుగులలో 32.3, చింతపల్లిలో 32.0, ముంచంగిపుట్టులో 30.9, పెదబయలుఉ, హుకుంపేటలో 30.8, డుంబ్రిగుడలో 30.6, జీకేవీధిలో 30.5, అనంతగిరిలో 30.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అరకులోయలో...
అరకులోయ: మండలంలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాసింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురిసింది. ఉక్కపోతతో ఇబ్బంది పడిన జనం వర్షంతో ఊరట చెందారు.
ముంచంగిపుట్టు...
ముంచంగిపుట్టు: మండల పరిధిలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనానికి అంతరాయం కలిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గత రెండు రోజులుగా సాయంత్రం అయితే చాలు వర్షం పడుతోంది. దీంతో వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులు చిత్తడిగా మారాయి. డుడుమ, జోలాపుట్టు జలాశయాలకు వరద నీరు ఇన్‌ఫ్లో పెరిగింది.