మన్యంలో భిన్న వాతావరణం
ABN , Publish Date - May 17 , 2025 | 12:57 AM
వాతావరణంలోని మార్పులతో మన్యంలో గత కొద్ది రోజులుగా విభిన్నమైన వాతావరణం కొనసాగుతున్నది. పాడేరులో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు దట్టంగా పొగమంచు, ఆ తర్వాత నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండ, అనంతరం ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం భారీ వర్షం
అయినా తగ్గని గరిష్ఠ ఉష్ణోగ్రతలు
పాడేరు, మే 16(ఆంధ్రజ్యోతి): వాతావరణంలోని మార్పులతో మన్యంలో గత కొద్ది రోజులుగా విభిన్నమైన వాతావరణం కొనసాగుతున్నది. పాడేరులో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు దట్టంగా పొగమంచు, ఆ తర్వాత నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండ, అనంతరం ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు శీతాకాలాన్ని తలపించేలా పొగమంచు కురిసింది. తర్వాత నుంచి ఎండ తీవ్ర ప్రతాపం చూపింది. ఆ వెంటనే భారీ వర్షం కురిసింది. అయితే వాతావరణంలోని ఇన్ని మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పు కానరావడం లేదు.
కొయ్యూరులో 35.0 డిగ్రీల ఉష్ణోగ్రత
ఏజెన్సీలో శుక్రవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొయ్యూరులో 35.0 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అరకులోయలో 34.9, పాడేరులో 34.5, డుంబ్రిగుడలో 31.4, అనంతగిరిలో 30.8, పెదబయలులో 30.5, హుకుంపేటలో 30.1, జీకేవీధి, చింతపల్లిలో 30.0, జి.మాడుగులలో 29.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
16ఎంపీటీ1: ముంచంగిపుట్టులో వర్షం కురుస్తున్న దృశ్యం
ముంచంగిపుట్టులో కుండపోత
ముంచంగిపుట్టు, మే 16 (ఆంధ్రజ్యోతి):
మండలంతో శుక్రవారం మధ్యాహ్నం కుండపోతగా వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మండల కేంద్రంతోపాటు జోలాపుట్టు, సంగడ, పెదబయలు, కుమడ, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ప్రధాన రహదారులపై నుంచి వర్షపు నీరు ప్రవహించింది. మట్టి రహదారులు బురదమయంగా మారాయి. రాకపోకలు సాగించేందుకు వాహన చోదకులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. భారీ ఈదురు గాలులతో వర్షం కురడంతో మధ్యాహ్నం నుంచి మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్టు కొమ్మలు విద్యుత్ వైర్లపైన పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి ఎనిమిది గంటలు దాటినా విద్యుత్ సరఫరా రాలేకపోవడంతో ప్రజలు అంధకారంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.