Share News

ఏజెన్సీలోని అంబులెన్స్‌లకు డీజిల్‌ సమస్య

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:09 PM

ప్రభుత్వం సరఫరా చేస్తున్న డీజిల్‌ ఏజెన్సీలోని అంబులెన్స్‌లకు 15 రోజులకే సరిపోతుందని, మిగిలిన 15 రోజుల పరిస్థితి ఏమిటని అరకు జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోష్ని ప్రశ్నించారు.

ఏజెన్సీలోని అంబులెన్స్‌లకు డీజిల్‌ సమస్య
మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, చిత్రంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టర్లు ఎంఎన్‌.హరేంధిరప్రసాద్‌, విజయకృష్ణన్‌, దినేశ్‌కుమార్‌

ప్రభుత్వం సరఫరా చేస్తున్నది 15 రోజులతో సరి

మిగిలిన రోజుల పరిస్థితి ఏమిటి?

ప్రశ్నించిన అరకు జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోష్ని

మాడగడ పీహెచ్‌సీలో అందుబాటులో ఉండని వైద్యుడు

జడ్పీ సమావేశంలో పలు అంశాలు ప్రస్తావించిన సభ్యులు

విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సరఫరా చేస్తున్న డీజిల్‌ ఏజెన్సీలోని అంబులెన్స్‌లకు 15 రోజులకే సరిపోతుందని, మిగిలిన 15 రోజుల పరిస్థితి ఏమిటని అరకు జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోష్ని ప్రశ్నించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన మంగళవారం జడ్పీ సమావేశమందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ అంశంపై చైర్‌పర్సన్‌ సుభద్ర జోక్యం చేసుకుని డీజిల్‌ సమస్య వల్ల అంబులెన్సులు రోడ్డెక్కకపోవడంతో గిరిజనులకు అత్యవసర వైద్యం అందడం లేదన్నారు. ఏజెన్సీకి చెందిన వారు ఎవరైనా కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోతే.. వారి మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకురావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోష్ని చెప్పగా, విశాఖ కలెక్టర్‌ ఎంఎన్‌.హరేంధిరప్రసాద్‌ బదులిస్తూ.. మృతదేహాలను వెంటనే తరలించడానికి అంబులెన్స్‌లు ఏర్పాటుచేయాలని కేజీహెచ్‌ ప్రతినిధి చంద్రశేఖరనాయుడుని ఆదేశించారు. మాడగడ పీహెచ్‌సీలో డాక్టర్‌ అందుబాటులో ఉండడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అరకు జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోష్ని ఆరోపించగా, అల్లూరి జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ స్పందిస్తూ మాడగడ పీహెచ్‌సీలో డాక్టర్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో రొమ్ము క్యాన్సర్‌, మూత్రపిండాల వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నదని, ఇందుకు గల కారణాలను తెలుసుకుని సత్వర వైద్య పరీక్షలు, చికిత్స అందించాలని జడ్పీటీసీ సభ్యులు కోరారు. అనకాపల్లి జిల్లా పరిధిలో బీఎన్‌ రోడ్డు, వడ్డాది-పాడేరు రోడ్డు మాడుగుల మండల పరిధిలో దారుణంగా వుందని సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. అనంతగిరి, నక్కపల్లి జడ్పీటీసీ సభ్యులు డి.గంగరాజు, గోసల కాసులమ్మ మాట్లాడుతూ నక్కపల్లి బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సీపీఎం నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేయగా.. జడ్పీ చైర్‌పర్సన్‌ జోక్యం చేసుకుని దీనిపై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్రం వాటా 90 శాతం కొనసాగించాలని కోరుతూ తీర్మానం చేయాలని ప్రతిపాదించగా, సభ్యులు ఆమోదించారు. సభ ప్రారంభమైన వెంటనే కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు మృతికి సంతాపం తెలిపి, రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. సమావేశంలో జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజకుమార్‌, వైస్‌చైర్మన్లు బీవీ సత్యవతి, సుంకరి గిరిబాబు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఒక్కరు కూడా జడ్పీ సమావేశానికి హాజరుకాలేదు. కాగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడంలేదని, అధికారులు ప్రొటోకాల్‌ పాటించడంలేదని జడ్పీ సమావేశంలో పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఆరోపించారు.

Updated Date - Dec 30 , 2025 | 11:09 PM