డీజిల్ మాఫియా
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:39 AM
నకిలీ డీజిల్ మాఫియా రెచ్చిపోతోంది.
ఉమ్మడి జిల్లాలో ‘నకిలీ’ విక్రయాలు
పరిశ్రమల అవసరాల పేరుతో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి హైడ్రోకార్బన్ ఆయిల్, డిస్టిలేట్ ఆయిల్, పారాఫిన్ ఆయిల్ వంటివి దిగుమతి
డీజిల్ మాదిరిగా రంగు, డెన్సిటీ కోసం రసాయనాలు మిక్సింగ్
అడ్డరోడ్డు, గాజువాక, పెందుర్తి, మల్కాపురంలో బ్లెండింగ్ యూనిట్లు
అక్కడి నుంచి నేరుగా ట్రాన్స్‌పోర్టు యజమానులకు విక్రయం
ఉమ్మడి విశాఖ జిల్లాలో రోజుకు రెండు లక్షల లీటర్ల అమ్మకం
రోజుకు రూ.31 లక్షల ఆదాయం కోల్పోతున్న రాష్ట్ర ప్రభుత్వం
నకిలీ ఆయిల్ వినియోగంతో వాహనాల జీవితకాలం తగ్గుదల, కాలుష్యం పెరుగుదల
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నకిలీ డీజిల్ మాఫియా రెచ్చిపోతోంది. పరిశ్రమల అవసరాల కోసమని చెప్పి తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల నుంచి మినరల్ హైడ్రోకార్బన్ ఆయిల్, డిస్టిలేట్ ఆయిల్, పారాఫిన్ ఆయిల్ వంటి వంటిని తీసుకువచ్చి...రంగు, డెన్సిటీ కోసం కొన్ని రకాల రసాయనాలను కలిపి తక్కువ ధరకు లారీ ట్రాన్స్‌పోర్టు యజమానుల కు విక్రయిస్తోంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడడంతోపాటు వాహనాల జీవితకాలం తగ్గిపోవడం, కాలుష్య సమస్య పెరగడం జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పరిశ్రమల ఆయిల్‌ను పెందుర్తి సమీపంలోని గుర్రంపాలెం వద్ద గల ప్లాంటులో డీజిల్‌గా మారుస్తుండగా ఈనెల 25న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేశారు. ట్యాంకర్‌తోపాటు భారీగా ఆయిల్‌ను సీజ్ చేసి, నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, నయారా, రిలయన్స్ వంటి కంపెనీలకు చెందిన పెట్రోల్ బంకులు 200 వరకు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 40 లక్షల నుంచి 50 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకం జరుగుతుంది. డీజిల్ విక్రయాలపై వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి 22.25 శాతం ఆదాయం దక్కుతుంది. లీటర్ డీజిల్ బేసిక్ ధర రూ.72.15 కాగా 22.25 శాతం వ్యాట్ కింద రూ.16 రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో రోజుకు 40 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతాయనుకుంటే...రూ.6.4 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతుంది. ఇదికాకుండా అడిషనల్ వ్యాట్, రోడ్ సెస్ కింద లీటర్‌కు మరో రూ.5 ఆదాయం లభిస్తుంది.
ఇదిలావుంటే పరిశ్రమల అవసరాల కోసం డీజిల్ మాదిరిగా ఉండే 10 పీపీఎం మినరల్ హైడ్రోకార్బన్ ఆయిల్ (ఎంహెచ్‌ఓ), డిస్టిలేట్ ఆయిల్, డీఓఎం స్పెషలిస్ట్ ఆయిల్, పారాఫిన్ ఆయిల్ వంటి వాటిని యూఏఈ నుంచి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు దిగుమతి చేసుకుంటున్నారు. అది జీఎస్‌టీ పరిధిలోకి రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నువాటా సమానంగా దక్కుతుంది. ఈ అయిల్ లీటర్ బేసిక్ ధర రూ.63 కాగా 18 శాతం జీఎస్‌టీ కింద కేంద్ర ప్రభుత్వానికి రూ.5.67 చొప్పున మాత్రమే ఆదాయం లభిస్తుంది. డీజిల్ ద్వారా రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయంతో పోల్చితే ఇది చాలా తక్కువ. గతంలో విశాఖ పోర్టుకు కూడా దిగుమతి అయిన ఈ తరహా ఆయిల్‌ను అక్కడకు వచ్చే భారీ కంటెయినర్లు, లారీలు, ట్రాలర్లకు విక్రయిస్తుండడంతో డీఆర్‌ఐ అధికారులు దాడి చేసి కేసులు నమోదుచేశారు. దీంతో దిగుమతి నిలిచింది. ప్రస్తుతం తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి రవాణా అవుతోంది. పరిశ్రమల అవసరాలకు వాడే ఆయిల్ రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో అధికారికంగానే జీఎస్‌టీ బిల్లు తీసుకుని ట్యాంకర్లతో తెలంగాణ, ఏపీ, ఒడిశా వస్తున్నారు. మార్గమధ్యంలో తమ వాహనాల నిలుపుదల కోసమంటూ ఒక గోడౌన్ ఏర్పాటుకు అనుమతి తీసుకుని అక్కడ బ్లెండింగ్ యూనిట్‌లు పెడుతున్నారు. అక్కడ పరిశ్రమలకు వాడే ఆయిల్‌కు కొన్ని రసాయనాలు కలిపి డీజిల్ మాదిరిగా రంగు, డెన్సిటీ వచ్చేలా ప్రాసెస్ చేసి ముందుగా అవగాహన కుదుర్చుకున్న ట్రాన్స్‌పోర్టు యజమానులు, లారీల యజమానులకు విక్రయిస్తున్నారు. డీజిల్ ధర కంటే రూ.పది వరకు తగ్గించి ఇస్తుండడంతో ఎక్కువ వాహనాలు ఉన్నవారు బంకుల్లో కాకుండా అనధికార వ్యాపారుల నుంచే కొనుగోలుచేస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రతిరోజూ రెండు లక్షల లీటర్లు వరకూ విక్రయిస్తున్నట్టు పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. అడ్డరోడ్డు, గాజువాక, పెందుర్తి, మల్కాపురం వంటి ప్రాంతాల్లో బ్లెండింగ్ యూనిట్‌లు ఉన్నట్టు సమాచారం. అక్రమ డీజిల్ విక్రయాలపై గతంలో గాజువాకలో విజిలెన్స్ అధికారులు దాడి చేసి కేసులు నమోదుచేశారు. ఇప్పటికీ ఈ తరహా విక్రయాలు గుట్టుగానే జరుగుతున్నా సివిల్ సప్లయ్స్ అధికారులు పట్టించుకోవడం లేదు. పరిశ్రమల ఆయిల్ సివిల్ సప్లై యాక్ట్ కిందకు రాదంటూ చర్యలకు వెనుకాడుతున్నారు. అక్రమ డీజిల్ విక్రయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి లీటరుకు రూ.15.40 ఆదాయానికి గండిపడుతోంది. రెండు లక్షల లీటర్లకు లెక్కేసుకుంటే రోజుకు రూ.31 లక్షల వరకు ఆదాయం కోల్పోతోంది. దీనిపై దృష్టిసారించాలని కోరుతూ జిల్లా పెట్రోల్ బంకుల అసోషియేషన్ ప్రతినిధులు ఇటీవల జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లతోపాటు నగర పోలీస్ కమిషనర్‌ను కూడా కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో అధికారులు ఈ తరహా మాఫియాపై నిఘా పెట్టినట్టు సమాచారం.