కాలువ గండిని పూడ్చరా?
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:17 PM
గత నెలలో కురిసిన భారీ వర్షాలకు మాకవరపాలెం మెరక కాలువకు పడిన గండిని అధికారులు ఇంతవరకు పూడ్చలేదు. వరి పొలాలకు నీరు రాకపోవడంతో నాట్లు ఎండిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం
స్పీకర్ అయ్యన్న ఆదేశించినా బేఖాతరు
నీరు అందక ఎండిపోతున్న వరినాట్లు
మాకవరపాలెం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గత నెలలో కురిసిన భారీ వర్షాలకు మాకవరపాలెం మెరక కాలువకు పడిన గండిని అధికారులు ఇంతవరకు పూడ్చలేదు. వరి పొలాలకు నీరు రాకపోవడంతో నాట్లు ఎండిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్పా నుంచి మాకవరపాలెం మెరక కాలువ ద్వారా మూడు గ్రామాలకు చెందిన సుమారు 500 ఎకరాలను సాగునీరు అందుతుంది. భారీ వర్షాల కారణంగా గత నెల 20వ తేదీన మెరక కాలవకు గండిపడింది. ఈ విషయం స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి రావడంతో సత్వరమే గండి పూడ్చివేత పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఇది జరిగి 25 రోజులు దాటినా.. ఇంతవరకు గండిని మాత్రం పూడ్చలేదు. మధ్యలో ఒకసారి రైతులు శ్రమదానంతో గండిని తాత్కాలికంగా పూడ్చుకున్నారు. తరువాత మళ్లీ భారీ వర్షాలు పడడంతో గతంలో గండి పడిన ప్రదేశంలోనే మళ్లీ గట్టు తెగిపోయింది. అప్పటి నుంచి పొలాలకు నీరు పారడంలేదు. వరినాట్లు వేసిన పొలాల్లో నీరు లేకపోవడంతో కలుపు విపరీతంగా పెరిగిపోతున్నదని, కొన్నిపొలాల్లో వరినాట్లు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెరకు కాలువ గండి పూడ్చివేత పనులు వెంటనే చేపట్టాలని కోరుతున్నారు.