Share News

దిబ్బపాలెం రోడ్లు ఛిద్రం

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:14 AM

భారీ వాహనాల రాకపోకలతో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) పునరావాస కాలనీ (దిబ్బపాలెం)లో రోడ్లు ఛిద్రమవుతున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి వాహనాలు సైతం వెళ్లడానికి వీలుకాని విధంగా భారీ గోతులు ఏర్పడ్డాయి. అంతేకాక వాహనాల రాకపోకల సమయంలో పెద్దఎత్తున దుమ్ము, ధూళి ఎగిసిపడి స్థానికులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

దిబ్బపాలెం రోడ్లు ఛిద్రం
దిబ్బపాలెం పంచాయతీ కార్యాలయం ఎదుట గోతుల మయమైన రహదారి

సెజ్‌ పునరావాస కాలనీ మీదుగా భారీ వాహనాల రాకపోకలు

అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ వంతెన పనులతో ట్రాఫిక్‌ మళ్లింపు

ఎక్కడికక్కడ ధ్వంసమైన రహదారులు

ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళి

వర్షం కురిస్తే బురదమయంతో కాలనీవాసుల ఇక్కట్లు

అచ్యుతాపురం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): భారీ వాహనాల రాకపోకలతో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) పునరావాస కాలనీ (దిబ్బపాలెం)లో రోడ్లు ఛిద్రమవుతున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి వాహనాలు సైతం వెళ్లడానికి వీలుకాని విధంగా భారీ గోతులు ఏర్పడ్డాయి. అంతేకాక వాహనాల రాకపోకల సమయంలో పెద్దఎత్తున దుమ్ము, ధూళి ఎగిసిపడి స్థానికులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో సుమారు 24 గ్రామాల భూములతోపాటు నివాసిత ప్రదేశాలను ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) కోసం సుమారు రెండు దశాబ్దాల క్రితం ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరించిన విషయం తెలిసిందే. నిర్వాసితులకు పునరావాసం కోసం దిబ్బపాలెం వద్ద 458 ఎకరాలను కేటాయించారు. ప్రస్తుతం ఈ కాలనీలో సుమారు 4,500 కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలనీలో ఏపీఐఐసీ రహదారులను నిర్మించింది. కాలనీలో నివసించే వారి వాహనాలతోపాటు విద్యా సంస్థలకు చెందిన వాహనాలు మాత్రమే ఈ రోడ్లపై రాకపోకలు సాగించాలి. అయితే అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ వంతెన నిర్మిస్తుండడంతో అచ్యుతాపురం జంక్షన్‌ నుంచి పూడిమడక వైపు సెజ్‌ కర్మాగారాలకు వెళ్లే రోడ్డును అధికారులు మూసేశారు. దీంతో అచ్యుతాపురం, వెదురువాడ, వెంకటాపురం జంక్షన్‌, సెజ్‌ పునరావాస కాలనీ మీదుగా వాహనాలను మళ్లించారు. సెజ్‌ కర్మాగారాలకు ఉద్యోగులను తీసుకువెళ్లే సుమారు 200 బస్సులు, యంత్రాల విడిభాగాలు, ముడి సరుకుతోపాటు సెజ్‌ కర్మాగారాల ఉత్పత్తులను రవాణా చేసే భారీ వాహనాలు సెజ్‌ పునరావాస కాలనీ మీదుగా 24 గంటలూ రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో పలుచోట్ల రహదారి కుంగిపోయి పూర్తిగా ఛిద్రమైంది. కొన్నిచోట్ల పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వర్షం కురిస్తే రహదారి మొత్తం బురదయమం అవుతున్నది. గోతుల్లో నీరు చేరి సాధారణ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ గోతుల్లో వాహనాలు కూరుకుపోయి ట్రాఫిక్‌ స్తంభిస్తున్నది. వరుసగా రెండు, మూడు రోజులపాటు వర్షం పడకపోతే రహదారిపై దుమ్ము, ధూళి లేస్తున్నది. దీనివల్ల కాలనీ వాసులు, ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Aug 09 , 2025 | 01:14 AM