Share News

నేడు డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా రాక

ABN , Publish Date - Nov 02 , 2025 | 01:04 AM

రాష్ట్ర పోలీస్‌ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీపీ) హరీష్‌కుమార్‌గుప్తా ఆదివారం నగరానికి రానున్నారు.

నేడు డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా రాక

పోలీస్‌ మెస్‌ ఆధునికీకరణకు శంకుస్థాపన

అనంతరం 14 స్టార్‌ హోటళ్లతో ఒప్పందం

పెట్టుబడుల సదస్సుకు భద్రతా ఏర్పాట్లపై సాయంత్రం సమీక్ష

విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర పోలీస్‌ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీపీ) హరీష్‌కుమార్‌గుప్తా ఆదివారం నగరానికి రానున్నారు. ఉదయం పది గంటలకు బీచ్‌రోడ్డులోని పోలీస్‌ మెస్‌కు చేరుకుంటారు. మెస్‌ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వెళతారు. ఐపీఎస్‌ అధికారులకు బస కల్పించే అంశంపై నగరంలోని 14 స్టార్‌ హోటళ్లతో డీజీపీ ఒప్పందం చేసుకుంటారు. అనంతరం కాపులుప్పాడ డంపింగ్‌ యార్డుకు వెళ్లి పది వేల కిలోల గంజాయిని నిర్వీర్యం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో సీఐఐ సదస్సుకు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లపై ఉత్తరాంధ్రలోని పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.


రహదారులపై వాహన వేగ పరిమితి పెంపు

విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని పలు ప్రధాన రహదారులపై వాహనాల వేగ పరిమితిని పెంచుతూ సీపీ శంఖబ్రతబాగ్చి శనివారం ఆదేశాలు జారీచేశారు. ప్రధాన రహదారులు, బీఆర్‌టీఎస్‌ కారిడార్‌, జాతీయ రహదారిపై వాహనాలకు ఒక నిర్ణీత వేగ పరిమితి ఉంటుంది. అంతకు మించిన వేగంతో నడిపితే ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కింద ఈ-చలాన్‌ జారీ అయిపోతుంది. జాతీయ రహదారిపై ఈ-మర్రిపాలెం నుంచి కూర్మన్నపాలెం జంక్షన్‌ వరకు వేగపరిమితి ప్రస్తుతం గంటకు 40 కిలోమీటర్లు ఉండగా, ఇప్పుడు 50కి పెంచారు. కొమ్మాది జంక్షన్‌ నుంచి రాజులపాలెం వరకూ వేగపరిమితి గంటకు 40 కిలోమీటర్లు ఉండగా, 50 కిలోమీటర్లకు పెంచారు. బీఆర్‌టీఎస్‌ రోడ్డులో పెందుర్తి నుంచి బాజీ జంక్షన్‌ వరకు ప్రస్తుతం 40 కిలోమీటర్లు వేగపరిమితి ఉండగా, దానిని ఇప్పుడు 50 కిలోమీటర్లకు పెంచారు. బీచ్‌రోడ్డులో ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భీమిలి వరకు గంటకు 40 కిలోమీటర్లు వేగపరిమితి ఉండగా, దానిని అలాగే కొనసాగించాలని నిర్ణయించారు. ఆనందపురం జంక్షన్‌ నుంచి పెందుర్తి మీదుగా పినగాడి వరకు వేగపరిమితి ప్రస్తుతం 60 కిలోమీటర్లు ఉండగా, దానిని అలాగే ఉంచారు. నగర పరిధిలోని మునిసిపల్‌ రోడ్లపై గంటకు 40 కిలోమీటర్లు వేగపరిమితిని అలాగే కొనసాగించాలని సీపీ నిర్ణయించారు. నిర్ణీత వేగానికి మించి వాహనాలను నడిపితే ట్రాఫిక్‌ ఉల్లంఘన కింద ఈ-చలాన్‌ ద్వారా జరిమానా విధిస్తామని సీపీ హెచ్చరించారు.

Updated Date - Nov 02 , 2025 | 01:04 AM