Share News

భారీ వినాయక విగ్రహాల వద్ద భక్తుల నిలుపుదోపిడీ

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:01 AM

ప్రజల విశ్వాసాన్ని కొందరు వినాయక ఉత్సవాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు.

భారీ వినాయక విగ్రహాల వద్ద భక్తుల నిలుపుదోపిడీ

దర్శనానికి రూ.100

ఫొటో దిగాలంటే రూ.60

నిర్వాహకుల దందా...పట్టించుకోని పోలీసులు

విశాఖపట్నం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):

ప్రజల విశ్వాసాన్ని కొందరు వినాయక ఉత్సవాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఏడాది గాజువాక లంకా మైదానంలో భారీ సుందర వస్త్ర గణపతి విగ్రహం, గాజువాక డిపో సమీపాన కోటి లింగాల గణపతి విగ్రహాలు ఏర్పాటయ్యాయి. భారీ గణపతి విగ్రహాలను దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివస్తుండడంతో నిర్వాహకుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతోంది. ఉత్సవ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వారికి కనీసం రెండు వందల రూపాయలు ఖర్చవుతోంది. పోలీస్‌ శాఖ హెచ్చరికలను ఉత్సవ నిర్వాహకులు ఎంత మాత్రం పట్టించుకోకుండా అడుగడుగునా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని భక్తులు గగ్గోలు పెడుతున్నారు. భక్తులకు ఉచిత దర్శనం కల్పించాలని, టికెట్లు రూపేణా వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు చేపడతామని నగర పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరించారు. దాంతో నిర్వాహకులు తెలివిగా ఎటువంటి బోర్డు పెట్టకుండా కొంతమంది కమిటీ సభ్యుల సహకారంతో నేరుగా భక్తుల నుంచి వంద రూపాయలు తీసుకుని దర్శనానికి పంపుతున్నారు. అదేవిధంగా వినాయక విగ్రహాల వద్ద ఫొటో తీసుకునేందుకు అరవై రూపాయలు, శివలింగ రూపంలో ఉన్న లడ్డూను దర్శించుకునేందుకు ఇరవై రూపాయలు, ఇతరత్రా విగ్రహాల దర్శనం కోసం మరికొంత...వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితి గాజువాకలో ఏర్పాటుచేసిన రెండు భారీ విగ్రహాల వద్ద కొనసాగుతోంది. ఇప్పటికైనా పోలీస్‌ శాఖ కళ్లు తెరవాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Sep 03 , 2025 | 01:01 AM