Share News

జోరుగా కేజీబీవీల్లో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:05 PM

జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) అదనపు వసతుల కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం జిల్లాలోని 13 కేజీబీవీలలో అభివృద్ధి పనులకు రూ.21.52 కోట్ల నిధులు మంజూరు చేయడంతో ప్రస్తుతం ఆ పనులు జోరుగా జరుగుతున్నాయి.

జోరుగా కేజీబీవీల్లో అభివృద్ధి పనులు
మాకవరపాలెంలో నిర్మాణంలో వున్న కేజీబీవీ భవనం

13 విద్యాలయాలకు రూ.21.52 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

పనులు పూర్తయితే విద్యార్థినులకు తప్పనున్న కష్టాలు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) అదనపు వసతుల కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం జిల్లాలోని 13 కేజీబీవీలలో అభివృద్ధి పనులకు రూ.21.52 కోట్ల నిధులు మంజూరు చేయడంతో ప్రస్తుతం ఆ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులు పూర్తయితే విద్యార్థినుల కష్టాలు తీరతాయి.

గత వైసీపీ ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరంలో 13 కేజీబీవీలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించినా బిల్లులు విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో చాలా చోట్ల పనులకు శంకుస్థాపన కూడా జరగలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేజీబీవీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి పనులు చేపడుతోంది. సమగ్ర శిక్ష ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా జిల్లాలో 13 కేజీబీవీలలో అదనపు తరగతి గదుల సముదాయాలు, మౌలిక వసతుల కోసం రూ.21.52 కోట్లతో పనులు చేపడుతున్నారు. ప్రతి కేజీబీవీకి మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయడమే కాకుండా ఇప్పటికే ప్రతి భవనానికి రూ.75 లక్షల నుంచి రూ.9 కోట్ల వరకు నిధులను సమగ్ర శిక్ష ఇంజనీరింగ్‌ అధికారులకు విడుదల చేశారు. అచ్యుతాపురం, బుచ్చెయ్యపేటల్లో నిర్మాణంలో వున్న కేజీబీవీ అదనపు భవన నిర్మాణ పనులు రూఫ్‌ స్థాయిలో ఉన్నాయి. దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట మండలాల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌ శ్లాబ్‌ స్థాయిలో, పైఅంతస్థు ఫ్లోర్‌ రూఫ్‌ లెవిల్‌లో పనులు జరుగుతున్నాయి. కోటవురట్ల గ్రౌండ్‌ ఫ్లోర్‌ శ్లాబ్‌ స్థాయిలో, మాకవరపాలెం గ్రౌండ్‌ ఫ్లోర్‌ చివరి దశలో, పైఅంతస్థు శ్లాబ్‌ దశలో పనులు జరగుతున్నాయి. నర్సీపట్నం, నాతవరం, రావికమతం శ్లాబ్‌ లెవిల్‌లో పనులు జరగుతున్నాయి. రోలుగుంటలో మాత్రం బేస్‌మెంట్‌ లెవిల్‌లో పనులు కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. మాడుగులలో గ్రౌండ్‌ఫ్లోర్‌ శ్లాబ్‌ దశలో, ఫస్ట్‌ ఫ్లోర్‌ కాలమ్స్‌ దశలో పనులు జరుగుతున్నాయి. ఎస్‌.రాయవరం మండలాల్లో కాంట్రాక్టరు పనులు చేపట్టకపోవడంతో మళ్లీ టెండర్లు పిలిచారు. త్వరలోనే ఆయా నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని సమగ్ర శిక్ష అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని కేజీబీవీల్లో ప్రస్తుతం జరుగుతున్న అదనపు గదులు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయితే విద్యాలయాల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ జయప్రకాశ్‌ తెలిపారు. వాస్తవానికి భవన నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఉందని, అయితే రెండు నెలల ముందుగానే పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

Updated Date - Sep 21 , 2025 | 11:05 PM