Share News

హైవే విస్తరణతో అభివృద్ధి

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:44 AM

జాతీయ రహదారి విస్తరణతో పారిశ్రామిక, వాణిజ్య, రవాణా రంగాల్లో జిల్లా అభివృద్ధి చెందుతుందని, ఉపాధికి అవకాశాలు పెరుగుతాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ పేర్కొన్నారు. అనకాపల్లి నుంచి రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్‌చెరువు వరకు 16వ నంబరు జాతీయ రహదారి ఆరు లేన్లకు విస్తరణ డీపీఆర్‌పై శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హైవే విస్తరణతో అభివృద్ధి
అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ సీఎం రమేశ్‌

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌

16వ నంబరు జాతీయ రహదారి విస్తరణ డీపీఆర్‌పై అధికారులతో సమావేశం

అనకాపల్లి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి విస్తరణతో పారిశ్రామిక, వాణిజ్య, రవాణా రంగాల్లో జిల్లా అభివృద్ధి చెందుతుందని, ఉపాధికి అవకాశాలు పెరుగుతాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ పేర్కొన్నారు. అనకాపల్లి నుంచి రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్‌చెరువు వరకు 16వ నంబరు జాతీయ రహదారి ఆరు లేన్లకు విస్తరణ డీపీఆర్‌పై శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రహదారి అనకాపల్లి జిల్లా పరిధిలో 68.64 కిలోమీటర్లు ఉంటుందన్నారు. అనకాపల్లి ‘డైట్‌’ కళాశాల వద్ద ప్రారంభమై, దివాన్‌చెరువు దాటిన తరువాత ముగుస్తుందని చెప్పారు. సత్వరమే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి, పనులు ప్రాంభించాలని అధికారులకు సూచించారు. అనకాపల్లి, ఎలమంచిలి రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, బయ్యవరం వద్ద గూడ్స్‌షెడ్‌ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. రాజుపాలెం, అనకాపల్లి ప్రాంతాల్లో ఆర్‌ఓబీ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. నర్సింగబిల్లి, ఎలమంచిలి, బయ్యవరం, రేగుపాలెం ప్రాంతాల్లో ఆర్‌యూబీల డీపీఆర్‌లు తయారీ దశలో ఉన్నాయని, త్వరలో రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్టు చెప్పారు.

కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడుతూ, రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్‌, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్‌, రైల్వే శాఖలు సమన్వయంతో పనిచేసి రైల్వేకు సంబంధించి తమ పరిధిలో ఉన్న సమస్యలను గుర్తించి నివేదికలు పంపాలన్నారు. సాంకేతిక నిపుణుల సూచనలను డీపీఆర్‌లో వుండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ రాజమహేంద్రవరం ప్రాజెక్టు డైరెక్టర్‌ రోహిత్‌కుమార్‌ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్‌కుమార్‌, పంచకర్ల రమేశ్‌బాబు, జేసీ జాహ్నవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 12:44 AM