Share News

పట్టాలెక్కని అభివృద్ధి!

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:24 AM

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ రీ డెవలప్‌మెంట్‌ పనులు మందకొడిగా సాగుతున్నాయి. మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసుకున్న ఈ ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో పాటే పనులు ప్రారంభమైన అనేక స్టేషన్లు అధునాతన వసతులతో సేవలు అందిస్తున్నాయి. విశాఖలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ రివైజ్డ్‌ మాస్టర్‌ప్లాన్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

పట్టాలెక్కని అభివృద్ధి!

మందకొడిగా రైల్వే స్టేషన్‌

రీ డెవలప్‌మెంట్‌ పనులు

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు

2022లో రూ.456 కోట్లు మంజూరు

మూడేళ్ల క్రితం శంకుస్థాపన

ఇప్పటికీ ఒక్కటి కూడా పూర్తికాని వైనం

14 ప్లాట్‌ఫారాలు, 36 లిఫ్ట్‌లు,

24 ఎస్కలేటర్లకు ప్రతిపాదనలు

రివైజ్డ్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదం కోసం ఎదురుచూపులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ రీ డెవలప్‌మెంట్‌ పనులు మందకొడిగా సాగుతున్నాయి. మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసుకున్న ఈ ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో పాటే పనులు ప్రారంభమైన అనేక స్టేషన్లు అధునాతన వసతులతో సేవలు అందిస్తున్నాయి. విశాఖలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ రివైజ్డ్‌ మాస్టర్‌ప్లాన్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

అమృత్‌ భారత్‌ పథకం కింద విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించాలని 2022లో రూ.456 కోట్లు మంజూరుచేశారు. ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్టర్లకు ఇబ్బందులు ఎదురుకావడంతో వారు మధ్యలోనే పనులు ఆపేసి వెళ్లిపోయారు. కోర్టు కేసులు అన్నీ ముగించుకొని ఇటీవలె కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. మాస్టర్‌ ప్లాన్‌లో కూడా మార్పులు చేశారు. రైల్వే జోన్‌ కార్యాలయం శంకుస్థాపనకు విశాఖపట్నం వచ్చిన రైల్వే బోర్టు చైర్మన్‌ రైల్వే స్టేషన్‌ను కూడా సందర్శించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న స్టేషన్‌లో 8 ప్లాట్‌ఫారాలు ఉండగా ప్లాన్‌లో అదనంగా రెండు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. చైర్మన్‌ అదనంగా మరో నాలుగు ప్లాట్‌ఫారాలు నిర్మించాలని ఆదేశించారు. అదేవిధంగా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల సంఖ్య పెంచాలని సూచించారు. దేశంలోని టాప్‌ 20 స్టేషన్లలో ఒకటిగా ఉన్న విశాఖ స్టేషన్‌ను ఆ స్థాయిలోనే అభివృద్ధి చేయాలని ఇంకా మరికొన్ని సూచనలు చేశారు. హౌరాలో ఉన్న విధంగా రైల్వే ట్రాక్‌ల మీదుగా ‘ఎయిర్‌ కాంకోర్స్‌’ నిర్మించాలని, అందులో ప్రయాణికులకు వసతులతో పాటు వాణిజ్య కార్యకలాపాలకు షాపులు పెట్టాలని సూచించారు. వీటన్నింటినీ జోడించి రివైజ్డ్‌ మాస్టర్‌ ప్లాన్‌ పంపిస్తే దానికి ఆమోదం ఇస్తామని చెప్పారు. దాంతో 14 ప్లాట్‌ఫారాలతో కొత్త ప్లాన్‌ పంపించారు. ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు.

యార్డ్‌ రీ మోడలింగ్‌

కొత్త ప్రతిపాదనల్లో రైల్వే యార్డ్‌ను ఆధునికీకరిస్తామని పేర్కొన్నారు. ఆపరేషన్లకు సౌలభ్యంగా ఉండేలా, రైళ్లు వచ్చి, పోయేందుకు అనువుగా యార్డ్‌లో మార్పులు చేస్తారు. అదేవిధంగా 20 ఎస్కలేటర్లు, 20 లిఫ్ట్‌లకు బదులుగా 36 లిఫ్ట్‌లు, 24 ఎస్కలేటర్లకు ప్రతిపాదించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ర్యాంపుల నిర్మాణాలు జోడించారు. ఈ మార్పులకు ఆమోదం లభించిన వెంటనే పనులు వేగవంతం చేసి 18 నెలల్లో పూర్తిచేసి 2027లో పూర్తి చేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Updated Date - Nov 27 , 2025 | 01:24 AM