రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు
ABN , Publish Date - May 23 , 2025 | 12:56 AM
కూటమి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంతోపాటు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మండలంలోని అడ్డరోడ్డు జంక్షన్‌లో గురువారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లాస్థాయి మినీ మహానాడుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు
జనరంజకంగా కూటమి పాలన
జిల్లాస్థాయి మినీ మహానాడులో ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర
వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని ధ్వజం
జగన్‌కు జనమే సినిమా చూపిస్తారని హోం మంత్రి అనిత ఎద్దేవా
విజయవంతమైన మినీమహానాడు
ఎస్.రాయవరం, మే 22 (ఆంధ్రజ్యోతి): కూటమి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంతోపాటు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మండలంలోని అడ్డరోడ్డు జంక్షన్‌లో గురువారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లాస్థాయి మినీ మహానాడుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి రవీంద్ర మాట్లాడుతూ, వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన శని అని ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో నష్టపోయారని అన్నారు. వైసీపీ అక్రమాలు, అవినీతి, దోపిడీ, అరాచకాలతో విసుగుచెందిన ప్రజలు గత ఎన్నికల్లో కూటమికి ఘన విజయం చేకూర్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతోపాటు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వీటి వల్ల లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి అన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి జిల్లాలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టే విధంగా కృషి చేస్తానని రవీంద్ర చెప్పారు.
హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం టీడీపీ అగ్ర నాయకుల నుంచి కార్యకర్తలకు వరకు ఎంతోమందిపై అక్రమ కేసులు పెట్టి వేధించిందని మండిపడ్డారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ తరచూ ‘సినిమా చూపిస్తాను.. సినిమా చూపిస్తాను’ అని అంటున్నారని, గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చూపించిన సినిమా జగన్‌కు సరిపోలేదా? అని ప్రశ్నించారు. జగన్‌కు ఒకసారి అధికారం అప్పగించి పొరపాటు చేశామని, జీవితంలో మరోసారి ఆ పొరపాటు చేయమని ప్రజలు అంటున్నారని అన్నారు. జగన్‌కు త్వరలో బ్లాక్ బస్టర్ సినిమా చూపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనిత ఎద్దేవా చేశారు. పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్‌ప్లాంట్ తదితర పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వీటిల్లో లక్షమందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వుంటాయని తెలిపారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, నిధుల విడుదల విషయంలో తన నియోజకవర్గంపట్ల వివక్షత చూపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
మినీ మహానాడు ఘన విజయం
ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు వద్ద గురువారం జిల్లాస్థాయి మినీమహానాడును విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభాస్థలి మొత్తం నిండిపోగా, చాలా మంది సభాప్రాంగణం వెలుపల నిల్చోవాల్సి వచ్చింది. మహిళలకు కేటాయించిన కుర్చీలన్నీ నిండిపోవడంతో పలువురు వేదిక సమీపంలోని ఖాళీ స్థలంలో కూర్చుని నేతల ప్రసంగాలను ఆలకించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడులో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, టీడీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, ప్రగడ నాగేశ్వరరావు, మళ్ల సురేంద్ర, పీవీజీ కుమార్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, డీసీఎంఎస్ ఛైర్మన్ కోట్ని బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.