మాస్టర్ ప్లాన్ ప్రకారమే నర్సీపట్నం అభివృద్ధి
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:55 AM
పురపాలక సంఘం మాస్టర్ ప్లాన్ ఆధారంగానే అభివృద్ధి పనులు జరుగుతాయని వీఎంఆర్డీఏ ప్రణాళిక అధికారి వీఎంఆర్డీఏ ప్రణాళిక అధికారి అరుణవల్లి తెలిపారు. మాస్టర్ ప్లాన్‌పై సూచనలు తీసుకోవడానికి గురువారం పట్టణానికి చెందిన వ్యాపారులు, ప్రముఖులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపకల్పన
చుట్టుపక్కల ఉన్న ఆరు పంచాయతీలను కూడా కలిపి..
ప్రధాన రహదారులు వంద అడుగులకు విస్తరణ
150 అడుగుల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు
వీఎంఆర్డీఏ ప్లానింగ్ ఆఫీసర్ అరుణవల్లి వెల్లడి
మాస్టర్ ప్లాన్‌పై వివిధ వర్గాలతో సమావేశం
నర్సీపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘం మాస్టర్ ప్లాన్ ఆధారంగానే అభివృద్ధి పనులు జరుగుతాయని వీఎంఆర్డీఏ ప్రణాళిక అధికారి వీఎంఆర్డీఏ ప్రణాళిక అధికారి అరుణవల్లి తెలిపారు. మాస్టర్ ప్లాన్‌పై సూచనలు తీసుకోవడానికి గురువారం పట్టణానికి చెందిన వ్యాపారులు, ప్రముఖులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్ సురేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి హాజరైన ఆమె మాట్లాడుతూ, మునిసిపాలిటీ బృహత్తర ప్రణాళిక ముసాయిదా నోటిఫికేషన్‌ను ఈ ఏడాది జూలైలో విడుదల చేసినట్టు గుర్తు చేశారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలు వెల్లడించాలని కోరారు. అభ్యంతరాలను నివృత్తి చేసిన తర్వాతే తుది ప్రకటన విడుదల అవుతుందని తెలిపారు. రానున్న 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మునిసిపాలిటీతోపాటు చుట్టుపక్కల వున్న చెట్టుపల్లి, ధర్మసాగరం, ఓఎల్‌పురం, గురందొరపాలెం, దుగ్డాడ, నీలంపేట పంచాయతీలను కలిపి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు చెప్పారు. నర్సీపట్నం నుంచి తాళ్లపాలెం, కృష్ణాదేవిపేట, చింతపల్లి, చోడవరం వైపు వున్న రహదారులను 100 అడుగులకు, తుని, అడ్డురోడ్డు వైపునకు ఉన్న రహదారులకు 80 అడుగులకు మాస్టర్‌ప్లాన్‌లో చూపించినట్టు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో పట్టణంలో ఐదు రోడ్ల విస్తరణ, కొత్తగా ఐదు రోడ్ల నిర్మాణం, 150 అడుగుల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించామని చెప్పారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖ జిల్లా కార్యదర్శి సుతాపల్లి శ్రావణ్ మాట్లాడుతూ, ఇన్నర్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేస్తే పట్టణంలో ట్రాఫిక్ సమస్య తొలగుతుందని సూచించారు. పట్టణంలోని అన్ని రహదారులను 100 అడుగులకు విస్తరించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, కొంతమేర తగ్గించాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక సరిగా లేదని అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం మాస్టర్ ప్లాన్‌లో స్టేట్ హైవేలన్నీ 100 అడుగులు ఉండాలని చెప్పారు. రోడ్ల విస్తరణ జరిగేటప్పుడు పాలకవర్గం తీర్మానం మేరకు కొంతమేర తగ్గించి చేసుకోవచ్చని తెలిపారు. ప్లాన్ మంజూరుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు మాత్రం వంద అడుగులకు సెట్ బ్యాక్ చూపించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముసాయిదా మాస్టర్ ప్లాన్‌పై మొత్తం 192 అభ్యంతరాలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.