నేడు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రాక
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:24 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్ శనివారం నగరానికి రానున్నారు.
విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్ శనివారం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 4.30 గంటలకు విశాఖపట్నం రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తూర్పు నౌకాదళంలోని అతిథి గృహానికి వెళతారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 5.50 గంటలకు ఐఎన్‌ఎస్ సముద్రికలో తూర్పు నౌకాదళం ఏర్పాటుచేసే కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రి ఎనిమిది గంటలకు అక్కడ నుంచి విమానాశ్రయానికి చేరుకుని, 8.30 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళతారు.
గూగుల్‌కు 480 ఎకరాలు
యాదవ్ భవన్‌కు 2 ఎకరాలు
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
గూగుల్ డేటా సెంటర్‌కు అవసరమైన భూములు కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అడవివరం, తర్లువాడ, రాంబిల్లిలో 480 ఎకరాలు ఇవ్వనున్నారు. ఈ భూములను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్‌కు ఇస్తారు. అలాగే ముడసర్లోవలో యాదవ్ భవన్ నిర్మాణానికి రెండు ఎకరాలు కేటాయించడానికి కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఎకరా రూ.12.1 కోట్లు చొప్పున రెండు ఎకరాలకు రూ.24.2 కోట్లు చెల్లించాలని సూచించింది.
హాట్‌కేకుల్లా అమ్ముడైన వన్డే టికెట్లు
విశాఖపట్నం-స్పోర్ట్స్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 6న ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. శుక్రవారం ఉదయం ఆన్‌లైన్‌లో డిస్ర్టిక్ బై జొమాటో యాప్ ద్వారా చేపట్టిన అమ్మకాలకు క్రీడాభిమానుల విశేష స్పందన లభించింది. విక్రయాలు ప్రారంభమైన గంటల వ్యవధిలోనే రూ.1,200, 2,000, 2,500, 3,000, 3,500, 4,000, 5,000 శ్రేణి ధరల టికెట్లు అయిపోయాయి. మరికొద్దిసేపటికే రూ.10,000 టికెట్లు కూడా అమ్ముడైపోయాయి. ఇక సాయంత్రం వరకు కార్పొరేట్ బాక్స్ రూ.15,000, షూట్ రూ.18,000 ధర టికెట్లు అందుబాటులో ఉండగా, రాత్రి 9.00 గంటల సమయంలో రూ.18,000 టికెట్లు కూడా కనిపించలేదు. మిగిలిన కార్పొరేట్ బాక్స్ రూ.15,000 టికెట్లు మాత్రం రాత్రి 10.00 గంటలకు అందుబాటటులో ఉన్నట్టు వెబ్‌సైట్‌లో చూపించింది. స్టేడియం సామర్థ్యం మేరకు 22 వేల టికెట్లు అమ్మకానికి పెడుతున్నట్టు ఏసీఏ ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఏ ధర టికెట్లు ఎన్ని (డినామినేషన్) అనే వివరాలను వెల్లడించలేదు. రూ.1,200 టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అయిపోవడంతో సగటు క్రీడాభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.