నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాక
ABN , Publish Date - Jul 23 , 2025 | 01:07 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ బుధవారం నగరానికి వస్తున్నారు.
‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు
సిరిపురం, జూలై 22 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ బుధవారం నగరానికి వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక ఆర్కే బీచ్‌రోడ్డులోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాల్‌లో సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్నది. ఆయనతో పాటు చిత్ర బృందం వేడుకలో పాల్గొననున్నారు.
నకిలీ డాక్టర్ అరెస్టు
కిడ్నీలు ఇప్పిస్తానంటూ కొందరిని, ఇచ్చేందుకు ముందుకొచ్చిన మరికొందని మోసగించి డబ్బులు తీసుకున్న వైనం
సీతంపేట (విశాఖపట్నం), జూలై 22 (ఆంధ్రజ్యోతి):
కిడ్నీ బాధితులను, కిడ్నీలు అమ్ముతానంటూ ముందుకొచ్చిన వారిని మోసగిస్తున్న నకిలీ డాక్టర్‌ను నాలుగో పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...అనంతపురం జిల్లా గుంతకల్లు విద్యానగర్‌లో నివాసం ఉంటున్న సయ్యద్ హనీఫ్ షా (54) తన ఫేస్‌బుక్‌లో కిడ్నీ డోనర్స్ గ్రూపు క్రియేట్ చేశాడు. అందులో తనను డాక్టర్ ఆనంద్‌గా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో కొంతమందిని నమ్మించి డబ్బులు తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా బ్లాక్ చేయడం చేసేవాడు. ఇదే తరహాలో జనవరిలో అక్కయ్యపాలెంలోని బికాన్ హోటల్‌కు ఫోన్ చేశాడు. తనకు సంబంధించిన రోగులు ఒడిశా నుంచి వస్తున్నారని, రూమ్ కావాలని చెప్పాడు. డబ్బులు తానే చెల్లిస్తానన్నాడు. ఒడిశా ప్రాంతానికి చెందిన ముగ్గురు జనవరి 28న వచ్చి మూడు రోజులు ఉన్నారు. వారు డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయారు. అదే తరహాలో జూన్ 29న హోటల్‌కు ఫోన్ చేసి ఇద్దరికి రూమ్ కావాలని చెప్పాడు. 30న ఏలూరుకు చెందిన రాంబాబు, యేసు రాజు వచ్చారు. వారు హోటల్‌లో ఉండి డాక్టర్ ఆనంద్‌కు ఫోన్ చేస్తే లిఫ్టు చేయలేదు. అయితే వీరు కిడ్నీ అమ్మకం గురించి మాట్లాడుతుండడంతో హోటల్ మేనేజర్ అబ్బాస్ నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ సత్యనారాయణ వారిని పిలిపించి విచారించి పంపేశారు. అయితే తమకు అద్దె చెల్లించలేదని హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ చిన్నంనాయుడు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు డాక్టర్ ఆనంద్ పేరుతో పరిచయం చేసుకుంటున్న నకిలీ డాక్టర్ సయ్యద్ హనీఫ్ షాను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ ఇప్పిస్తానంటూ కొంతమందిని, కిడ్నీ ఇచ్చేందుకు ముందుకువచ్చిన మరికొంతమందిని (మొత్తం ఏడుగురు) సయ్యద్ హనీఫ్ నమ్మించి డబ్బులు వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. సయ్యద్ హనీఫ్ షాను మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు సీఐ సత్యనారాయణ తెలిపారు.
గాయత్రి మెడికల్ కళాశాలలో అడ్మిషన్లపై నిషేధం
అనుమతుల కోసం అడ్డదారులు తొక్కినట్టు సీబీఐ నిర్ధారణ
ఇద్దరిపై కేసు నమోదు
విశాఖపట్నం, జూలై 22 (ఆంధ్రజ్యోతి) :
నగర పరిధిలోని గాయత్రి మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఝలక్ ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలపై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా ఈ తరహా చర్యలను తొమ్మిది మెడికల్ కాలేజీలపై తీసుకోగా, గాయత్రీ మెడికల్ కళాశాల ఆ జాబితాలో ఉంది. దీనివల్ల సుమారు 200 సీట్లను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. గాయత్రీ మెడికల్ కాలేజీలో ఈ ఏడాది ప్రవేశాలకు సంబంధించిన సీట్ల సంఖ్యను సున్నాగా పేర్కొనడంపై వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్‌ఎంసీ అనుమతుల కోసం అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడి ఈ పరిస్థితి తెచ్చుకున్నట్టు చెబుతున్నారు.
దేశంలోని మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, తదితరాలను పరిశీలించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు జారీ చేస్తుంది. ఇందుకోసం కాలేజీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన వైద్యులు వెళుతుంటారు. అలా తనిఖీలకు వెళ్లిన వైద్యులతోపాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు చెందిన అధికారులను మభ్యపెట్టి గాయత్రీ మెడికల్ కాలేజీ అనుమతులు తెచ్చుకున్నట్టు సీబీఐ గుర్తించింది. గాయత్రీ మెడికల్ కాలేజీ నుంచి విశాఖకు చెందిన డాక్టర్ కృష్ణకిశోర్ సుమారు రూ.50 లక్షల వరకు తీసుకున్నట్టు సీబీఐ అధికారులు గుర్తించి చార్జిషీట్ ఫైల్ చేశారు. గాయత్రి డైరెక్టర్ వెంకట్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) గాయత్రీ మెడికల్ కాలేజీ ప్రవేశాలపై నిషేధాన్ని విధించింది.