21న డీఈవో కార్యాలయం ముట్టడి
ABN , Publish Date - May 18 , 2025 | 12:27 AM
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. శనివారం డాబాగార్డెన్‌లో గల ఆర్‌బీఎం యూపీ పాఠశాలలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు జి.గోపినాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలతో స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపు
విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. శనివారం డాబాగార్డెన్‌లో గల ఆర్‌బీఎం యూపీ పాఠశాలలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు జి.గోపినాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలతో స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోపినాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్-117తో ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. దీనిని రద్దుచేస్తామని హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం... పాఠశాల విద్యకు మరింత ప్రమాదం తెచ్చేపెట్టేలా జీవో 19, 20, 21లను తీసుకువచ్చి తొమ్మిది రకాల బడులను అమలు చేయడం అన్యాయమన్నారు. బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించినా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా ఏర్పడి ఆందోళనకు నిర్ణయించాయన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 21న డీఈవో కార్యాలయాలు ముట్టడికి పిలుపునిచ్చాయన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఉపాధ్యాయుడు హాజరై విజయవంతం చేయాలని కోరారు. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ప్రధానోపాధ్యాయుల సంఘం నుంచి వీఎస్ వేణుగోపాల్‌తోపాటు గోపినాథ్ (పీఆర్‌టీయూ), ఇమంది పైడిరాజు (ఎస్టీయూ), టి.రామకృష్ణ (ఏపీటీఎఫ్- 257), జి.చిన్నబ్బాయ్ (యూటీఎఫ్), ఎ.అరుణ్‌కుమార్ (ఏపీయూఎస్), ఎన్.ధనుంజయరావు (ఏపీటీఎఫ్-1938), బి.చిన్నారావు (ఏపీపీటీఎ), సీహెచ్ సూర్యనారాయణ (వైఎస్సార్‌టీఏ)లను ఎన్నుకున్నారు.
===