Share News

వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లకు వీర డిమాండ్‌

ABN , Publish Date - Mar 19 , 2025 | 01:25 AM

విశాఖపట్నం నుంచి పలు దూర ప్రాంతాలకు నడుపుతున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటోంది.

వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లకు వీర డిమాండ్‌

  • సగటున 150 శాతానికి పైగా ఆక్యుపెన్సీ

  • షిర్డీ, కొల్లాం, గాంధీదామ్‌ ఎక్స్‌ప్రెస్‌లకు వందల్లోనే ‘వెయిటింగ్‌’

  • ...అయినా ఫ్రీక్వెన్సీ పెంపునకు ముందుకురాని రైల్వే పెద్దలు

  • వాల్తేరు డివిజన్‌పై వివక్ష

  • ఢిల్లీలో యత్నిస్తేనే ఫలితం

  • ఉత్తరాంధ్ర ఎంపీలు ఆ దిశగా దృష్టిపెట్టాలని ప్రయాణికుల విజ్ఞప్తి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం నుంచి పలు దూర ప్రాంతాలకు నడుపుతున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటోంది. ఆక్యుపెన్సీ 150 శాతానికి మించి నమోదవుతోంది. ఎక్కడైనా ఇలా ఉంటే వారానికి ఒకసారి నడిపే వాటిని రెండు నుంచి మూడు రోజులకు పెంచి, ఆ తరువాత రెగ్యులర్‌గా నడిపేందుకు యత్నిస్తారు. కానీ వాల్తేరు రైల్వే డివిజన్‌లో పదేళ్లు గడిచిపోతున్నా వాటిని వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగానే ఉంచుతున్నారు. ఫ్రీక్వెన్సీ పెంచే ప్రయత్నాలు ఏమీ కనిపించడం లేదు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ విషయానికి వస్తే ఇక్కడి నుంచి ప్రయాణించే వారి సంఖ్య పరంగా గాని, ఆదాయం విషయంలో గాని అగ్రస్థానంలో ఉంటోంది. అయినా ఇక్కడి అవసరాలపై రైల్వే అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు.

ఇవిగో ఆక్యుపెన్సీ లెక్కలు...

విశాఖపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతున్న వీక్లీ రైళ్లు, వాటి ఆక్యుపెన్సీ వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి సేకరించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

- విశాఖపట్నం నుంచి 18503 నంబరుతో షిర్డీకి 2012లో వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించారు. 2023 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి మధ్య ఆ రైలు ఆక్యుపెన్సీ 167.72 శాతం నమోదైంది. 2024 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 165.21 శాతం ఆక్యుపెన్సీ ఉంది.

- విశాఖపట్నం నుంచి 18567 నంబరుతో కొల్లాంకు 2014లో వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించారు. ఈ రైలుకు 2023 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు 164.41 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. 2024 ఏప్రిల్‌ నుంచి వరకు 163.98 శాతం ఆక్యుపెన్సీ ఉంది.

- విశాఖ నుంచి 20803 నంబరుతో గాంధీధామ్‌కు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను 2014లో ప్రారంభించారు. 2023 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు దీని ఆక్యుపెన్సీ 107.94 శాతం ఉండగా, 2024 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 179.07 శాతం నమోదైంది.

- విశాఖపట్నం నుంచి 22801 నంబరుతో చెన్నై సెంట్రల్‌కు నడుపుతున్న సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 138.8 శాతం, 2024 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 139.92 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది.

ఈ మార్గాల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ జాబితా 227 నుంచి 805కు పెరిగింది. ఈ మార్గాల్లో ఎంత డిమాండ్‌ ఉందో చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనం.

విచిత్రంగా ఈ రైళ్లన్నీ విశాఖ నుంచి ఆయా గమ్యస్థానాలకు వెళ్లి ఆ మరుసటిరోజే అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతున్నాయి. ఆయా నగరాల నుంచి రైలులో విశాఖపట్నం వెనక్కి రావాలంటే మళ్లీ ఈ రైలు వెళ్లేంత వరకు వారం రోజులు ఆగాల్సిందే. లేదంటే వేర్వేరు రైళ్లు మారాల్సి ఉంటుంది. రైలులో వెళ్లి అటు నుంచి విమానంలో వద్దామన్నా...షిర్డీ, గాంధీధామ్‌ల నుంచి ఆ సౌకర్యం కూడా లేదు. అందుకని వారానికి కనీసం రోజు తప్పించి రోజు ఈ రైళ్లు నడిపేలా చూడాలని విశాఖపట్నం రైలు వినియోగదారుల సంఘం తూర్పు కోస్తా రైల్వే అధికారులను కోరుతోంది.

ఢిల్లీలో ప్రయత్నిస్తేనే పచ్చజెండా

ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లను వారానికి మూడు రోజులు నడిపేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ గత కొన్నాళ్లుగా వాల్తేరు డివిజన్‌ అధికారులు ప్రతిపాదనలు పెడుతున్నారు. అయితే ఈ రైళ్లు ఎక్కడికైతే వెళుతున్నాయో ఆ ప్రాంతానికి చెందిన రైల్వే జోనల్‌ అధికారులు కూడా దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. వీటికి సౌత్‌ సెంట్రల్‌, సౌత్‌ వెస్టర్న్‌ జోన్‌ అధికారులు అంగీకరించచడం లేదని సమాచారం. వీటిపై అధికారులపరంగానే కాకుండా రాజకీయపరమైన ఒత్తిడి ఢిల్లీలో పెడితేనే పని జరుగుతుంది. ఉత్తరాంధ్ర ఎంపీలు ఆ రకమైన ప్రయత్నాలు చేయాల్సి ఉంది.

రైల్వే జోన్‌కు జీఎంను నియమించండి

పార్లమెంటులో ఎంపీ శ్రీభరత్‌

విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేసిన దక్షిణ కోస్తా జోన్‌కు తక్షణమే జనరల్‌ మేనేజర్‌ను నియమించాలని ఎంపీ శ్రీభరత్‌ కోరారు. పార్లమెంటులో మంగళవారం రైల్వే అంశాలపై చర్చ జరిగినప్పుడు ఆయన మాట్లాడారు. జోనల్‌ కార్యాలయానికి టెండర్లు పిలిచినందుకు కృతజ్ఞతలు చెబుతూ వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నం డివిజన్‌గా కొనసాగిస్తున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. దానికి కూడా కొత్త డీఆర్‌ఎంను నియమించాలన్నారు. సరకు రవాణా రైళ్ల వేగం సగటున గంటకు 50 కి.మీ. ఉండేలా చూడాలన్నారు. రవాణా సమయాన్ని తగ్గించగలిగితే లాజిస్టిక్స్‌ వ్యవహారాలు మరింత విస్తృతమవుతాయన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 01:25 AM