ఎస్.కోటపై తర్జనభర్జన
ABN , Publish Date - Oct 31 , 2025 | 01:12 AM
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
విశాఖ జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్
జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘానికి భారీగా వినతులు
ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు ప్రచారం
‘పెందుర్తి’పైనా ఏదో ఒక నిర్ణయం
నియోజకవర్గం మొత్తం ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం
విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎస్.కోట అసెంబ్లీ సెగ్మెంట్ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉంది. అందువల్ల ఆ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు వినతులు ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిల్లాల పునర్విభజనలో తలెత్తిన లోపాలను సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ప్రస్తుత జిల్లాల్లో మార్పులు, చేర్పులపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడు రోజుల క్రితం సమావేశమైంది. గత ప్రభుత్వం 2022లో కొత్త జిల్లాలు ఏర్పాటుచేసినప్పుడు ఎస్.కోటను విశాఖపట్నంలో విలీనం చేయాలనే డిమాండ్ వచ్చింది. అయితే అందుకు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ పెద్దలు అడ్డుచెప్పడంతో ప్రభుత్వం ఎస్.కోటను విజయనగరం జిల్లాలోనే కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా వైసీపీ నేతలు పట్టించుకోలేదు. గత ఏడాది ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్.కోటను విశాఖపట్నంలో విలీనం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఆయన సీఎం అయిన తరువాత టీడీపీ నేతలు ఎన్నికల హామీ విషయాన్ని ప్రస్తావించారు. ఇదేవిధంగా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఇబ్బందులను సీఎం దృష్టికి నేతలు తీసుకువెళ్లడంతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేశారు. జిల్లాల నుంచి అభ్యంతరాలు, వినతులను నేరుగా ఉపసంఘం తీసుకుంది. ఇంకా జిల్లా యంత్రాంగాల ద్వారా మంత్రివర్గ ఉపసంఘానికి నేతలు నివేదికలు పంపించారు. విశాఖ జిల్లాకు సంబంధించి ఎస్.కోటను విశాఖ జిల్లాలో విలీనం చేయాలని వచ్చిన వినతులను మంత్రివర్గ ఉప సంఘానికి పంపారు. ఒకవేళ ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేయాలనుకుంటే ఆ పరిధిలోని నాలుగు మండలాలను విశాఖపట్నం లేదా భీమిలి డివిజన్‌లో విలీనం చేయాల్సి ఉంటుంది.
ఇక పెందుర్తి నియోజకవర్గం విశాఖపట్నం, అనకాపల్లి రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంది. పెందుర్తి మండలం విశాఖ రెవెన్యూ డివిజన్‌లో ఉండగా, పరవాడ, సబ్బవరం మండలాలు అనకాపల్లి డివిజన్‌లో ఉన్నాయి. దీంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాల పునర్విభజన సమయంలో పెందుర్తి నియోజకవర్గం మొత్తాన్ని అనకాపల్లి జిల్లా పరిధిలో చేర్చాలనే ప్రతిపాదనపై వ్యతిరేకత వచ్చింది. దీంతో మధ్యేమార్గంగా పెందుర్తి మండలాన్ని విశాఖ జిల్లాలో కొనసాగించి, సబ్బవరం, పరవాడ మండలాలను అనకాపల్లి జిల్లాలో కలిపారు. కాగా అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పరవాడ, సబ్బవరం మండలాలను విశాఖ డివిజన్‌లో చేర్చుతారా?, లేక పెందుర్తి మండలాన్ని కూడా అనకాపల్లి విలీనం చేస్తారా?...అనేది చూడాలి. ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా పెందుర్తి నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లా పరిధిలోకి వస్తుంది.