నిమ్మకాయలకు గిరాకీ
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:28 AM
వేసవి ఆరంభం కావడంతో నిమ్మ కాయలకు గిరాకీ పెరిగింది. వ్యాపారులు తోటల వద్దకే వచ్చి నిమ్మకాయలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధర అనూహ్యంగా పెరిగింది. కిలో రూ.100 నుంచి రూ.120కి కొనుగోలు చేస్తున్నారు.

వేసవి ఆరంభంతో పెరిగిన డిమాండ్
తోటల వద్దకే వచ్చి కిలో రూ.100-120కి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
కోటవురట్ల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): వేసవి ఆరంభం కావడంతో నిమ్మ కాయలకు గిరాకీ పెరిగింది. వ్యాపారులు తోటల వద్దకే వచ్చి నిమ్మకాయలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధర అనూహ్యంగా పెరిగింది. కిలో రూ.100 నుంచి రూ.120కి కొనుగోలు చేస్తున్నారు. దీంతో నిమ్మతోటలు సాగు చేస్తున్న రైతులకు కాసుల పంట పండుతోంది. కోటవురట్ల మండలంలో కైలాసపట్నం, లింగాపురం, విశ్వనాఽథపురం, టి.జగ్గంపేట, తిమ్మాపురం, కోటవురట్ల, అల్లుమియాపాలెం, చినబోడ్డేపల్లి గ్రామాల్లో సుమారు 150 ఎకరాల్లో నిమ్మ తోటలు వున్నాయి. వాస్తవంగా ఐదారేళ్ల క్రితం వరకు ఈ గ్రామాల్లో ఇంచుమించుగా 500 ఎకరాల్లో నిమ్మ తోటలు వుండేవి. మార్కెట్‌లో ధరలు స్థిరంగా లేకపోవడం, కొన్నిసార్లు కోత ఖర్చులు కూడా రానంతగా ధర పడిపోవడంతో పలువురు రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో నిమ్మ తోటలు నరికివేసి, వేరే పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా వుండడంతో రానురాను నిమ్మ సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. దీంతో మార్కెట్ అవసరాలకు సరిపడ దిగుబడి లేకుండా పోయింది. ప్రస్తుతం ఊరగాయల సీజన్ కావడంతోపాటు వేసవి రావడంతో నిమ్మకాయల వినియోగం పెరిగింది. నర్సీపట్నం, తుని, అనకాపల్లి నుంచి వ్యాపారులు తోటల వద్దకే వచ్చి, రైతులు చెప్పిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో సాగుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.