Share News

ఢిల్లీ పేలుళ్లతో అప్రమత్తం

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:40 AM

ఢిల్లీ పేలుళ్లతో కేంద్ర హోమంత్రిత్వ శాఖ రాష్ర్టాలను అప్రమత్తం చేసింది.

ఢిల్లీ పేలుళ్లతో అప్రమత్తం

నగరంలో వాహనాల తనిఖీ

లాడ్జీలు, హోటళ్లలో కూడా...

మద్దిలపాలెం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి)

ఢిల్లీ పేలుళ్లతో కేంద్ర హోమంత్రిత్వ శాఖ రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు నగరంలో పోలీసులు సోమవారం రాత్రి నాకాబందీ నిర్వహించారు. జాతీయ రహదారిపై ఎంవీపీ కాలనీ, మద్దిలపాలెం, గురుద్వారా, అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, కంచరపాలెం, ఎన్‌ఏడీ జంక్షన్‌ల వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఏసీపీల పర్యవేక్షణలో రాత్రి ఎనిమిది గంటల నుంచి వాహనాలను, ముఖ్యంగా కార్లను నిలిపి డిక్కీ, లోపల క్షుణ్ణంగా పరిశీలించారు. నగరంలోని ఆర్టీసీ బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్‌లో మెటల్‌ డిటెక్టర్లు, బాంబు/డాగ్‌ స్క్వాడ్‌ల సహాయంతో ప్రయాణికుల లగేజీలను తనిఖీ చేశారు. ఈనెల 14, 15 తేదీల్లో ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో సీఐఐ సమ్మిట్‌ నిర్వహించనున్న నేపథ్యంలో మద్దిలపాలెం, త్రీటౌన్‌ జంక్షన్‌లలో వాహనాలను అణువణువూ పరిశీలించారు. అలాగే లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్‌ హౌస్‌లు, కార్గో సర్వీస్‌ సెంటర్‌లు, కొరియర్‌ కార్యాలయాలను పరిశీలించారు. అనుమానితులను, ఇతర ప్రాంతాల నుంచి బ్యాగులతో వచ్చేవారిని సైతం ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల డీసీపీ-1 పర్యవేక్షణలో ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి నగర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలు కనిపిస్తే వెంటనే 112,94933 36633 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Updated Date - Nov 11 , 2025 | 01:40 AM