Share News

ఉక్కులో తొలగింపులు

ABN , Publish Date - Oct 24 , 2025 | 01:02 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు వర్కర్ల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఉక్కులో తొలగింపులు

  • నాలుగు రోజుల క్రితం 500 మంది కాంట్రాక్టు వర్కర్లు నిలిపివేత

  • మరో 1,000 మందిని పక్కన పెట్టడానికి ప్రణాళిక

  • ప్రజా ప్రతినిధుల విన్నపాలు బుట్టదాఖలు

  • డిసెంబరు 31కి ప్లాంటులో ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు

  • 15 వేల మందే ఉండాలని లక్ష్యం

విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు వర్కర్ల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వందలాది మందిని బయటకు పంపుతున్నారు. నాలుగు రోజుల క్రితం 500 మంది కాంట్రాక్టు వర్కర్లను తొలగించారు. మరో వేయి మందిని తొలగించడానికి ప్రణాళిక రూపొందించారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఇచ్చిన లక్ష్యం ప్రకారం ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ఉద్యోగుల సంఖ్య 7,500, కాంట్రాక్టు వర్కర్ల సంఖ్య 7,500 మాత్రమే ఉండాలి. మొత్తం 15 వేలకు మించి ఉన్నవారిని బయటకు పంపాలి. ఆ ఆదేశానికి అనుగుణంగా యాజమాన్యం దశల వారీగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఉద్యోగులు 9,500 మంది, కాంట్రాక్టు వర్కర్లు 8,500 మంది కలిపి 18 వేల మంది ఉన్నారు. ప్లాంటులో చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరినీ తొలగించి, పెద్ద కాంట్రాక్టర్లకు గుత్తగా విభాగాలను అప్పగించే ప్రక్రియకు రెండు నెలల క్రితం ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఈఓఐ) ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 32 విభాగాలను నిర్వహించడానికి టెండర్లు పిలిచారు. ఆ ప్రక్రియ పూర్తయి కొత్త కాంట్రాక్టర్లు వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు వర్కర్ల సంఖ్యను 7,500కు తీసుకురావాలి. దానికి అనుగుణంగా వారిని తగ్గిస్తున్నారు.

విభాగాల మార్పుతో రాజీనామాలు

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత యాజమాన్యం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. కొన్ని దశాబ్దాలుగా ఒకే విభాగంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను తీసుకువెళ్లి సంబంధం లేని వేరే విభాగాల్లో పనులు చేయాలని చెబుతోంది. అక్కడ పెద్ద పెద్ద లక్ష్యాలు ఇస్తున్నారు. వాటిని విభాగాధిపతులు సాధించలేకపోతున్నారు. దాంతో వారిపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇవన్నీ అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. దాంతో చాలా మంది విభాగాధిపతి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. వీఆర్‌ఎస్‌ తీసుకోకుండా ఉండిపోయిన వారిని ఇలా పొగ పెట్టి బయటకు పంపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఆధార్‌ కార్డుల బ్లాకింగ్‌

కాంట్రాక్టు వర్కర్ల తొలగింపు పేరుతో 300 మంది వరకు నిర్వాసితులను పక్కనపెట్టారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కొత్తగా తీసుకునే వారిలో నిర్వాసితులకే ప్రాధాన్యం ఇవ్వాలని విశాఖ ఎంపీ శ్రీభరత్‌, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాజమాన్యాన్ని కోరుతున్నారు. పరిశీలిస్తామని చెబుతున్నారే తప్ప ఐదు నెలలైనా తొలగించిన వారిని తిరిగి తీసుకోలేదు. పైగా తొలగించిన వర్కర్లకు ఇంకెక్కడా పని దొరక్కుండా వారి ఆధార్‌ కార్డులను కాంట్రాక్టర్ల పోర్టల్‌లో బ్లాక్‌ చేసేశారు. దాంతో కొత్త కాంట్రాక్టర్ల వద్ద వారు పనిలో చేరే అవకాశం లేకుండా పోయింది. ఇది అన్యాయమని, వెంటనే ఆధార్‌ కార్డులను అన్‌ బ్లాకింగ్‌ చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నా యాజమాన్యం స్పందించడం లేదు.


మరో విభాగం నిర్వహణ ప్రైవేటుకు...

రూ.98 కోట్లతో సింటర్‌ ప్లాంటు-1కు టెండర్‌

అక్కడ పనిచేస్తున్న 330 మంది కాంట్రాక్టు వర్కర్ల తొలగింపు?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టీల్‌ తయారీలో అత్యంత కీలకమైన విభాగం నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించేందుకు స్టీల్‌ ప్లాంటు ప్రకటన జారీచేసింది. వ్యయం తగ్గింపు, ఉద్యోగులు, కార్మికుల కుదింపు, 90 శాతానికి పైగా ఉత్పత్తి సాధన లక్ష్యాలతో ముందుకు వెళుతున్న యాజమాన్యం తాజాగా సింటర్‌ ప్లాంటు-1 టెక్నికల్‌ మేనేజ్‌మెంట్‌, మెయింటెనెన్స్‌కు ఆసక్తి కలిగిన వారు ముందుకు రావాలంటూ ప్రకటించింది. రెండేళ్లు నిర్వహణకుగాను రూ.98 కోట్లు ఇస్తామని పేర్కొంది.

స్టీల్‌ తయారీలో సింటర్‌ చాలా కీలకం. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ (బీఎఫ్‌)లో నేరుగా ముడి పదార్థాలు వేస్తే ఫర్నేస్‌ పాడైపోతుందని ముందుగా ‘సింటర్‌’ తయారుచేస్తారు. దానిని బ్లాస్ట్‌ఫర్నేస్‌లో ఉపయోగిస్తారు. స్టీల్‌ ప్లాంటులో రెండు సింటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. మూడు బ్లాస్ట్‌ ఫర్నేసులకు అవసరమైన సింటర్‌ మొత్తం ఈ రెండింటి నుంచే పంపుతారు.

సింటర్‌ అంటే..

స్టీల్‌ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు ఐరన్‌ ఓర్‌, ఫైన్‌ కోక్‌, లైమ్‌ స్టోన్‌లను నిర్ణీత నిష్పత్తిలో కలిపి ద్రవరూపంలోకి మారే ఉష్ణోగ్రత వద్ద మండి స్తారు. ఆ ప్రక్రియలో చిన్న చిన్న రంధ్రాలు కలిగిన రాళ్ల మాదిరి పదార్థం తయారవుతుంది. దానినే ‘సింటర్‌’ అంటారు. ఈ సింటర్‌నే బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో ఉపయోగిస్తారు. సింటర్‌ ప్లాంటు-1లో సమారు 330 మంది కాంట్రాక్టు వర్కర్లు పనిచేస్తున్నారు. ఈ విభాగాన్ని ప్రైవేటుకు అప్పగిస్తే వారందరినీ తొలగిస్తారు.

ఆర్‌ఎంహెచ్‌పీ నుంచి మెటీరియల్‌ తెచ్చుకోవాలి

రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటులోని బంకర్లలో సింటర్‌ తయారీకి అవసరమైన ముడి పదార్థాలన్నీ ఉంటాయి. వాటిని సింటర్‌ ప్లాంటుకు తెప్పించుకొని, సక్రమంగా నిర్వహించుకోవలసిన బాధ్యత కాంట్రాక్టు సంస్థదే. పర్యవేక్షణకు మాత్రం స్టీల్‌ ప్లాంటు అధికారులను ఉంచుతారు. మిగిలిన ప్రక్రియ మొత్తం ప్రైవేటు సంస్థే చూసుకోవాలి.

Updated Date - Oct 24 , 2025 | 01:02 AM