Share News

భూముల రీసర్వేలో జాప్యాన్ని సహించేది లేదు

ABN , Publish Date - May 07 , 2025 | 12:25 AM

జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియలో జాప్యాన్ని సహించేది లేదని, అందుకు బాధ్యులపై చర్యలు చేపడతామని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ హెచ్చరించారు. జిల్లాలోని రెవెన్యూ, సర్వే విభాగం అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రీసర్వేను నిర్లక్ష్యంగా నిర్వహిస్తే ఊరుకునేది లేదన్నారు. గ్రామాల్లో సభలు నిర్వహించి ఆయా గ్రామసభల్లో స్వీకరించిన ఫిర్యాదులను, వినతులను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు. మ్యుటేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఏ స్థాయిలోనైనా తమ లాగిన్‌లో పెండింగ్‌లు ఉండకూడదన్నారు.

భూముల రీసర్వేలో జాప్యాన్ని సహించేది లేదు
మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన జేసీ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌

- అధికారులకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ హెచ్చరిక

పాడేరు, మే 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియలో జాప్యాన్ని సహించేది లేదని, అందుకు బాధ్యులపై చర్యలు చేపడతామని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ హెచ్చరించారు. జిల్లాలోని రెవెన్యూ, సర్వే విభాగం అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రీసర్వేను నిర్లక్ష్యంగా నిర్వహిస్తే ఊరుకునేది లేదన్నారు. గ్రామాల్లో సభలు నిర్వహించి ఆయా గ్రామసభల్లో స్వీకరించిన ఫిర్యాదులను, వినతులను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు. మ్యుటేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఏ స్థాయిలోనైనా తమ లాగిన్‌లో పెండింగ్‌లు ఉండకూడదన్నారు. ఎప్పటికప్పుడు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. తాను అడిగిన ప్రశ్నలకు సక్రమంగా సమాధానాలు చెప్పని ముంచంగిపుట్టు తహసీల్దార్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలతను కలెక్టర్‌ ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై జిల్లా స్థాయి సమీక్షకు ముందే ఆయా తహసీల్దార్లు, ఇతర అధికారులతో డీఆర్‌వో సమావేశం నిర్వహించాలని, అలాగే మండల స్థాయి అధికారులు సైతం సరైన సమాచారం, వివరాలతో కలెక్టర్‌ సమీక్షకు హాజరుకావాలన్నారు. ఇకపై తాను వేసే ప్రశ్నలకు నీళ్లు నమిలితే ఊరుకునేది లేదన్నారు. రానున్న ఐదు వారాల్లో రీసర్వేలో భాగంగా చేపట్టే పనులపై కార్యాచరణ రూపొందించాలని, దాని ప్రగతిని ప్రతీ వారం సమీక్షిస్తానని తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన వినతులను సైతం సకాలంలో పరిష్కరించాలన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి అందిన దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని, ప్రతీ శనివారం పబ్లిక్‌ కన్వీయన్స్‌ డేగా భావించి ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, ట్రైనీ కలెక్టర్‌ నాగ వెంకటసాహిత్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, టీడబ్ల్యూ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు, సర్వే విభాగం ఏడీ దేవేంద్రుడు, జిల్లాలోని 22 మండలాలకు చెందిన రెవెన్యూ, సర్వే విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 12:25 AM