ఏఐడీఎస్‌వో ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థుల ఆందోళన
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:31 PM
డిగ్రీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఏఐడీఎస్‌వో) ఆధ్వర్యంలో శనివారం ఏయూ వీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఏఐడీఎస్‌వో) ఆధ్వర్యంలో శనివారం ఏయూ వీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. డిగ్రీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఏఐడీఎస్‌వో ఆధ్వర్యంలో చలో ఆంధ్రా యూనివర్సిటీకి పిలుపునివ్వగా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ర్యాలీగా వీసీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని తొలగించాలని, మూడు సబ్జెక్టుల కాంబినేషన్‌ను పునఃప్రవేశపెట్టాలని, సీఎస్‌పీ, ఇంటర్న్‌షిప్‌లను తొలగించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏఐడీఎస్‌వో అధ్యక్షుడు కె.అభిలాశ్ మాట్లాడుతూ సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానం వల్ల విద్యార్థులు తాము ఎంచుకుంటున్న సబ్జెక్టుపై సమగ్ర జ్ఞానాన్ని కోల్పోతున్నారన్నారు. డిగ్రీ విద్యకు అవసరమైన ఇతర అనుబంధ సబ్జెక్టులను తొలగించడం వల్ల విద్యార్థులు పరిమితమైన జ్ఞానంతో మిగిలిపోతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐడీఎస్‌వో ఉపాధ్యక్షుడు బి.సంతోశ్, సభ్యులు చరణ్, సిద్ధు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.