డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:47 AM
మండలంలోని ఇరువాడ శివారు గణపతినగర్‌లో ఒక యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. గణపతినగర్‌కు చెందిన కర్రి అప్పలనాయుడు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదుతున్నాడు.
అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు స్నేహితుడికి వీడియో కాల్
అతను వారించి.. వచ్చేలోపే ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం
సబ్బవరం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఇరువాడ శివారు గణపతినగర్‌లో ఒక యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. గణపతినగర్‌కు చెందిన కర్రి అప్పలనాయుడు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదుతున్నాడు. ఇతని తండ్రి నారాయణ ఒడిశాలోని పారాదీప్‌లో కూలీగా పనిచేస్తుండగా, తల్లి లీలాకుమారి ఇక్కడ భవన నిర్మాణ కార్మికురాలిగా పని చేస్తున్నది. కాగా అప్పలనాయుడు గురువారం రాత్రి సమీపంలోని ఒక గ్రామంలో అమ్మవారి పండుగకు వెళుతున్నట్టు తల్లితో చెప్పి బయటకు వెళ్లాడు. తిరిగి అర్ధరాత్రి 1.30 గంటలకు ఇంటికి రాగా, తల్లి నిద్ర లేచి తలుపు తీసింది. అప్పలనాయుడు గదిలోకి వెళ్లగా, తల్లి బయట నిద్రించింది. అయితే అప్పలనాయుడు రాత్రి 2.30 గంటల సమయంలో పెందుర్తి మండలం చినముషిడివాడ దరి ఏకలవ్యనగర్‌లో ఉంటున్న స్నేహితుడు కేసుబోయిన సుబ్రహ్మణ్యంకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని, వెంటనే బయలుదేరి వస్తున్నానని అతను చెప్పాడు. వెంటనే మరో స్నేహితుడితో కలసి గణపతినగర్‌కు వచ్చాడు. అప్పలనాయుడు ఇంటికి వెళ్లి అతని తల్లిని నిద్ర లేపి, విషయం చెప్పి తలుపు తీయించాడు. అయితే అప్పటికే అప్పలనాయుడు ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. వెంటనే కిందకు దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ పి.సింహాచలం శుక్రవారం ఉదయం గణపతినగర్ వెళ్లి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అప్పలనాయుడు తల్లి లీలాకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్‌ఐ చెప్పారు.