26న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాక
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:25 AM
కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ నెల 26న విశాఖపట్నం వస్తున్నారు.
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ నెల 26న విశాఖపట్నం వస్తున్నారు. ఆ రోజున రెండు యుద్ధనౌకలు ‘హిమగిరి’, ‘ఉదయగిరి’...ఆయన చేతులు మీదుగా నౌకాదళంలో చేరతాయి. ఈ రెండూ విశాఖపట్నం కేంద్రంగా సేవలు అందించనున్నాయి.
29న ముఖ్యమంత్రి రాక
డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభం
వీఎంఆర్‌డీఏ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం
జాతీయ క్రీడా దినోత్సవం, అధికార భాషా దినోత్సవానికి హాజరు
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 29వ తేదీన నగరానికి రానున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని నేరుగా నోవాటెల్ హోటల్‌కు వెళతారు. అక్కడ ఏర్పాటుచేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం పర్యాటక శాఖకు చెందిన డబుల్ డెక్కర్ బస్సులు, వీఎంఆర్‌డీఏ చేపట్టిన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం ప్రో కబట్డీ పోటీలు ప్రారంభిస్తారు. అలాగే గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అధికార భాషా దినోత్సవంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలు ఇంకా అధికారికంగా ఖరారు కావల్సి ఉంది. సీఎం పర్యటించే ప్రాంతాలను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. అనంతరం వీఎంఆర్‌డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్, జేసీ మయూర్‌అశోక్, జీవీఎఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, ఏయూ అధికారులతో సమీక్షించారు.
విశాఖ విమల విద్యాలయం మూసివేత
ఆర్‌సీఎం సొసైటీ ప్రకటన
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): విశాఖ విమల విద్యాలయం మూతపడింది. ఇదే విషయాన్ని విద్యాలయాన్ని నడుపుతున్న ఆర్‌సీఎం సొసైటీ నోటీసు బోర్డులో పెట్టింది. ఈ ఏడాది తరగతులు పునఃప్రారంభం లేదని స్పష్టంచేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ఈ విద్యాలయంలో 1,700 మంది పిల్లలు చదువుతుండగా సంస్థ నిర్వహణకు నిధులు ఇవ్వలేమని స్టీల్ ప్లాంటు యాజమాన్యం చేతులు ఎత్తేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా విద్యా సంస్థను సొసైటీకి లీజుకు ఇచ్చే అగ్రిమెంట్‌ను పునరుద్ధరించలేదు. దాంతో సొసైటీ జిల్లా విద్యాశాఖాధికారికి దరఖాస్తు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. గత రెండేళ్లుగా ఇదే జరుగుతుండడంతో ఈసారి విద్యార్థుల తల్లిదండ్రులు ముందుగానే మేల్కొన్నారు. పునఃప్రారంభం కోసం ఎదురుచూస్తే పిల్లల భవిష్యత్తు పోతుందని అత్యధికులు పిల్లలను ఇతర పాఠశాలల్లో చేర్పించారు. మొత్తం 1,700 మందిలో ఇప్పటికే 1,630 మంది బదిలీ సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లిపోయారు. ఇంకా 70 మంది మాత్రమే మిగిలారు. వారికి ప్రైవేటు పాఠశాలల్లో చదివించే స్థోమత లేకపోవడంతో ఉండిపోయారు. పాఠశాల తెరుస్తారేమోనని ఆశించారు. కానీ ఈ ఏడాది ఇక సాధ్యం కాదని తాజాగా సొసైటీ నోటీసు పెట్టడంతో ఇప్పుడు వారు కూడా ఎక్కడో ఓ చోట చేరాల్సి ఉంది. వారికి టీసీలు ఇవ్వడానికి సొసైటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.