బాలికల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:21 AM
బాలికల అభివృద్ధి, బాల్య వివాహాలను అరికట్టేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆధేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా బాల్య వివాహాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
- అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
- డీసీపీవో, మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ
పాడేరు, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): బాలికల అభివృద్ధి, బాల్య వివాహాలను అరికట్టేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆధేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా బాల్య వివాహాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లలోపు వయసున్న బాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ప్రధానంగా టెన్త్ తరువాత ఇళ్లకు వెళ్లేవారిపై దృష్టి సారించాలన్నారు. ఆ సమయంలోనే అధికంగా బాల్య వివాహాలు జరిగేందుకు అవకాశం ఉంటుందని, వాటిని గుర్తించి అరికట్టాలన్నారు. ఈ క్రమంలో ఏర్పడే సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలని, అప్పటికీ పరిష్కారానికి నోచుకోకపోతేనే తన దృష్టికి తేవాలని సూచించారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లోని బాల్య వివాహాల నియంత్రణ అధికారులు సమర్థవంతంగా పని చేయాలని, కిశోర వికాసంలో సఖీ గ్రూప్‌లు సక్రమంగా నిర్వహించాలన్నారు. అలాగే డ్రాపవుట్ బాలికలను ఈ ఏడాదే పాఠశాలల్లో చేర్పించాలని, 18 ఏళ్లు నిండిన బాలికలకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవసరమైన శిక్షణలు ఇప్పించాలన్నారు. అందుకు గానూ జిల్లా విద్యాశాఖాధికారి, టీడబ్ల్యూ డీడీ, సీడీపీవోలు, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి సమస్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు బాల్య వివాహాల నియంత్రణలో భాగంగా గుర్తించి 48 మంది బాలికలకు అవసరమైన స్వయం ఉపాధి శిక్షణలు ఇప్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన బాలలను ఒకటో తరగతిలో చేర్పించాలని, అందుకు గానూ ఈ నెల 21, 22, 23 తేదీల్లో ప్రత్యేక ప్రవేశ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లోని గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, రక్తహీనతతో ఉన్న బాలలు, అనాథలు విభిన్న ప్రతిభావంతులు, ప్రత్యేక అవసరాల బాలల వివరాలను సీడీపీవోలు మండల స్థాయి విద్యాశాఖాధికారులకు అందించాలన్నారు. పదవ తరగతి పూర్తయిన బాలికలకు జూనియర్ కాలేజీపై ఉన్న బిడియాన్ని పొగొట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అలాగే బాలికలు అభివృద్ధికి ఉన్న పథకాలపై వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు.
డీసీపీవో, మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు
తమ విఽధులను సక్రమంగా నిర్వహించని జిల్లా బాలల సంరక్షణాధికారి, ఇద్దరు ప్రొబెషనరీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. జిల్లా బాలల సంరక్షణాధికారి టి.సద్దు పలు నివేదికలను విద్యాశాఖాధికారులకు సమర్పించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని సూచించారు. అలాగే జిల్లా కమిటీ సమావేశానికి హాజరు కాని ఇద్దరు ప్రొబెషనరీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచిస్తూ, పాడేరు డివిజన్ బాధ్యతను అనకాపల్లి ప్రొబేషనరీ అధికారికి, రంపచోడవరం డివిజన్‌లోని బాధ్యతలను రాజమహేంద్రవరం ప్రొబేషనరీ అధికారికి అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నుంచి రక్షించిన బాలల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జిల్లా బాలల సంరక్షణాధికారి, ప్రొబేషనరీ అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ ఎస్తేర్‌రాణి, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, టీ డబ్ల్యూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి రోహిణి, కార్మిక శాఖ ఏసీ సుజాత, జీసీడీవో సూర్యకుమారి, డీసీపీవో టి.సద్దు, సీడీపీవోలు, ఎంఈవోలు, తదితరులు పాల్గొన్నారు.