Share News

తగ్గుతున్న ఉక్కు ఉత్పత్తి

ABN , Publish Date - Aug 20 , 2025 | 01:18 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతోంది. పూర్తి సామర్థ్యంతో ప్లాంటును నడిపితేనే లాభాలు వస్తాయని చెబుతూ మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను ఆగమేఘాలపై ఉత్పత్తికి సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటికి అవసరమైన ముడి పదార్థాలు పూర్తిగా అందించలేకపోతున్నారు.

తగ్గుతున్న ఉక్కు ఉత్పత్తి

కన్వేయర్ల నిర్వహణలో వైఫల్యమే కారణం

అనుభవం కలిగిన కాంట్రాక్టు కార్మికులను తొలగించి

అవగాహన లేని వారి నియామకం

దాంతో రా మెటీరియల్‌ విభాగం నుంచి

ఆయా విభాగాలకు సరిగా చేరని ముడి పదార్థాలు

వారం రోజుల నుంచీ ఇదే పరిస్థితి

మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల ద్వారా గతంలో

రోజుకు 21 వేల టన్నుల స్టీల్‌ ఉత్పత్తి

ప్రస్తుతం 17,056 టన్నులే...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతోంది. పూర్తి సామర్థ్యంతో ప్లాంటును నడిపితేనే లాభాలు వస్తాయని చెబుతూ మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను ఆగమేఘాలపై ఉత్పత్తికి సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటికి అవసరమైన ముడి పదార్థాలు పూర్తిగా అందించలేకపోతున్నారు.

ప్రస్తుత సీఎండీ ఉత్పత్తి వ్యయం తగ్గించాలని 4,500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. కన్వేయర్ల నిర్వహణలో అనుభవం కలిగిన కాంట్రాక్టు వర్కర్లను తీసేసి, వారి స్థానంలో ఏమీ తెలియని ఒడిశా వర్కర్లను పెట్టారు. దాంతో రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటు నుంచి అవసరమైన మేరకు ముడి పదార్థాలు కన్వేయర్ల ద్వారా ఆయా విభాగాలకు చేరడం లేదు. సింటర్‌ తయారీ 70 శాతం పడిపోయింది. దాంతో బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. మూడూ కలిసి పనిచేస్తే రోజుకు 21 వేల టన్నుల స్టీల్‌ తయారవుతుంది. మొదట్లో లక్ష్యం సాధించాలని తీవ్ర ఒత్తిడి పెట్టడంతో అంతా శక్తికి మించి, విరామం కూడా తీసుకోకుండా 21 వేల టన్నులు తీశారు. కానీ గత వారం రోజుల నుంచి పరిస్థితి మారిపోయింది. ఈ నెల 16వ తేదీన మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల ద్వారా 18,023 టన్నులే వచ్చింది. 17వ తేదీన ఉత్పత్తి 17,577కు పడిపోయింది. 18వ తేదీన అంటే సోమవారం అది 17,056 టన్నులకు దిగిపోయింది.

ప్లాంటులోని బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో స్టీల్‌ తయారీకి ఐరన్‌ఓర్‌ ఫైన్స్‌తో సింటర్‌ (రసాయన మిశ్రమం) తయారుచేసి ఉపయోగిస్తారు. దీనికి ఉపయోగించే ఐరన్‌ఓర్‌ ఫైన్స్‌ తక్కువ ధరకే లభిస్తాయి. వీటితో సింటర్‌ తయారుచేసి బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో వేయడం వల్ల స్టీల్‌ ఉత్పత్తి ప్రక్రియ వేగంగా జరుగుతుంది. దీనిపై అవగాహన లేని యాజమాన్య ప్రతినిధులు కొందరు కొనుగోళ్లలో కమీషన్ల కోసం సింటర్‌ తయారీకి అవకాశం లేకుండా నేరుగా ఉపయోగించే ఐరన్‌ ఓర్‌ పెల్లెట్లను లక్షల టన్నుల్లో కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఐరన్‌ఓర్‌ ఫైన్స్‌ ధర టన్ను రూ.6 వేలు కాగా పెల్లెట్లు టన్ను రూ.11 వేలు పెట్టి కొంటున్నారు. అదేవిధంగా కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలకు మరమ్మతులు చేయించకుండా బయట సంస్థల నుంచి కోక్‌ కొంటున్నారు. గతంలో కోక్‌ ఓవెన్‌ బ్యాటరీల ద్వారా రోజుకు 420 వరకు కోక్‌ పుషింగ్‌లు జరిగేవి. ఇప్పుడు ఆ సంఖ్య 370కి పడిపోయింది. ఇలా తక్కువైన కోక్‌ను బయట పార్టీల దగ్గర టన్నుకు రూ.5 వేలు ఎక్కువ పెట్టి కొంటున్నారు. వీటన్నింటి నేపథ్యంలో గత మూడు నెలల్లో ఉత్పత్తి వ్యయంలో ముడి పదార్థాల వ్యయం 62 శాతం నుంచి 74 శాతానికి పెరిగింది.

Updated Date - Aug 20 , 2025 | 01:18 AM