నష్టపరిహారంపై తేల్చండి
ABN , Publish Date - May 21 , 2025 | 12:59 AM
ప్రత్యామ్నాయ జీవనోపాధితో పాటు నష్టపరిహారం ఎంత ఇస్తారో ముందుగా ప్రకటించిన తరువాతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూ సర్వే చేపట్టాలని, అప్పటి వరకు ఏ అధికారి గ్రామంలోకి అడుగు పెట్టవద్దని మండలంలోని తోటకూరపాలెం గ్రామస్ధులు రావికమతం తహసీల్దార్ బి.వెంకటరమణకు తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో భాగంగా బుచ్చియ్యపేట మండలం పెదపూడి, పంగిడి, రావికమతం మండలంలోని తోటకూరపాలెం గ్రామాల రెవెన్యూ పరిధిలో సుమారు 11 వందల ఎకరాలలో పెదపూడిని ఆనుకొని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగు, తాగు నీరు అందించాలన్నది లక్ష్యం.
- ప్రత్యామ్నాయ జీవనోపాధిపై స్పష్టమైన హామీ ఇవ్వండి
- ఆ తరువాతే గ్రామంలోకి అడుగు పెట్టండి
- సుజల స్రవంతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూ సర్వేకు వచ్చిన అధికారులకు తేల్చి చెప్పిన తోటకూరపాలెం గ్రామస్థులు
రావికమతం, మే 20(ఆంధ్రజ్యోతి): ప్రత్యామ్నాయ జీవనోపాధితో పాటు నష్టపరిహారం ఎంత ఇస్తారో ముందుగా ప్రకటించిన తరువాతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూ సర్వే చేపట్టాలని, అప్పటి వరకు ఏ అధికారి గ్రామంలోకి అడుగు పెట్టవద్దని మండలంలోని తోటకూరపాలెం గ్రామస్ధులు రావికమతం తహసీల్దార్ బి.వెంకటరమణకు తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో భాగంగా బుచ్చియ్యపేట మండలం పెదపూడి, పంగిడి, రావికమతం మండలంలోని తోటకూరపాలెం గ్రామాల రెవెన్యూ పరిధిలో సుమారు 11 వందల ఎకరాలలో పెదపూడిని ఆనుకొని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగు, తాగు నీరు అందించాలన్నది లక్ష్యం. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. అప్పట్లోనూ రైతులు అభ్యంతరం తెలిపారు. ఈలోగా ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పనుల ఊసే ఎత్తకుండా గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కలెక్టర్ ఆదేశాల మేరకు రావికమతం తహసీల్దార్ బి.వెంకటరమణ సర్వే సిబ్బంది, పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై రైతులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం కూడా తోటకూరపాలెం వెళ్లారు. దీంతో గ్రామస్ధులు, రైతులు భారీగా తరలి వచ్చి తహసీల్దార్ ఎదుట ఆందోళన చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ఏ విధమైన న్యాయం చేస్తారో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఇతర అధికారులు గ్రామానికి వచ్చి ప్రజా వేదికలో బహిరంగ హామీ ఇవ్వాలని, వారు ఇచ్చే భరోసాను బట్టి రైతులకు సమ్మతమైతేనే సర్వే చేయడానికి అంగీకరిస్తామని చెప్పారు. డీపీఆర్ ఏ విధంగా ఉందో బహిరంగంగా చూపాలని, ఎంత భూములను తీసుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. గతంలోనే తమ గ్రామానికి ఏ విధమైన ముప్పు లేకుండా డీపీఆర్ రూపొందిస్తామని చెప్పారని, ఆ విధంగానే ఇప్పుడు జరుగుతుందా? అనేది గ్రామంలో ప్రజా వేదిక ద్వారా బహిరంగంగా తెలియజేయాలని కోరారు. ఎవరు బడితే వారు తరచూ గ్రామానికి వచ్చి ఇష్టానుసారంగా సర్వేలు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. దీని వలన తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఎంపీపీ పైల రాజు, బోని సింహాచలంనాయుడు, పైల సూరిబాబు, రుత్తల రాము, ఎడ్ల సత్తిబాబు, చింతి అచ్చిబాబు, రైతులు చెప్పారు. తమకు జీవనాధారమైన భూములను లాక్కుంటే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ముందుగా ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డలు, వాగులను గుర్తిస్తారన్నారు. ఈ సర్వే వలన రైతులకు ఎలాంటి నష్టం గాని, భూములను బలవంతంగా లాక్కోవడం గాని జరగదన్నారు. రైతుల అభీష్టంతోనే సుజల స్రవంతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు చేపడతామని చెప్పారు. ఉన్నతాధికారుల సూచన మేరకే ముందుగా ప్రభుత్వ భూములను గుర్తించేందుకు ఈ సర్వే చేస్తున్నామని ఆయన తెలిపారు. అయితే దీనికి రైతులు అంగీకరించకపోవడంతో తహసీల్దార్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది వెనుతిరిగారు.